ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
బగనానపల్లె : రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. బనగానపల్లెలోని జి.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల స్థాయి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భూమానాగిరెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలు సీఎం చంద్రబాబులో లేవన్నారు. టీడీపీ అధికారం చేపట్టి 15 నెలలైనా ఒక్క అభివృద్ధి చేయలేదని, టీడీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
పట్టిసీమ ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తానని సీఎం చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు అధికారం బలంతో బనగానపల్లె నియోజకవర్గంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుల సహకారంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వేధింపులు తమకు కొత్తకాదని, గతంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశామన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ఇలాంటి వారు ఇంటి నుంచి బయటికి రాగలరా అంటూ ప్రశ్నించారు. కాటసాని కుటుంబానికి వేధింపులు కొత్తేమీ కాదని, బెదిరింపులను లెక్కచేయబోమన్నారు.
వైఎస్సార్ హయాంలో ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి కుసుమాలు విరిశాయని, టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కారణంగా మళ్లీ గ్రామాల్లో అశాంతి నెలకొందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కాటసాని రామిరెడ్డి అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా కలిసికట్టుగా రెక్కలు కట్టుకొని వాలుతామని భూమా భరోసా ఇచ్చారు. విసృతస్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం చూస్తుంటే అధికార పార్టీపైన, ఇక్కడి అధికార పార్టీ నాయకుడిపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతోందన్నారు.
‘బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకో’
ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణను మండలంలోని యనకండ్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేయించామన్నారు. అయితే పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే దానిని ఆపివేయించారన్నారు. ఈ విషయం తనకు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించే పోలీసులపై న్యాయపరంగా పోరాటం సాగిస్తామన్నారు.
గ్రేడుల వారీగా అవినీతి
చంద్రబాబు పాలనలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు గ్రేడుల వారీగా అవినీతి సాగుతోందని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. చేసిన అభివృద్ధి కొంతయితే ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బయోమెట్రిక్ విధానంతో ఎంతో మంది పేదలు పింఛన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజా సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్ష చేపడితే ఒక పోలీసు కానిస్టేబుల్‌ని కూడా నియమించని ప్రభుత్వం బనగానపల్లెలో మండల స్థాయి వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమేమిటంటూ ప్రశ్నించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజల మన్నలను చురగ్గొన్నవాడే ప్రజానాయకుడని బుగ్గన అన్నారు.