ఫీజు అందదు..బెంగ తీరదు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం షాకిచ్చింది. 2013-14 విద్యా సంవత్సరం ముగిసి రెండు నెలలవుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల మొత్తాలు చెల్లించకుండా ఇక్కట్ల పాల్జే స్తోంది. బకాయిల మొత్తం 59 కోట్ల రూపాయలకు చేరటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కళాశాలల యాజ మాన్యాలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ బెదిరింపులకు దిగుతున్నాయి.
కొత్తగా అధికారంలోకి వస్తున్న టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తుందో.. లేదోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదువు మధ్యలో ఆగిపోతుందేమోనని ఇంజినీరింగ్, ఫార్మశీ, వైద్య విద్యా కోర్సులు చదువుతున్నవారు కలవరపడుతున్నారు.
నిధులకు కొరత లేని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలుకు సరిపడా నిధులు విడుదల చేయలేదని, ప్రస్తుతం వేలాది కోట్ల రూపాయల లోటుతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న టీడీపీ ప్రభుత్వం విద్యార్థి సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులు కేటాయిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు 311 ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీసీ విద్యార్థులు 66,930 మంది, ఎస్సీ విద్యార్థులు 7,095 మంది, ఎస్టీ విద్యార్థులు 3,844 మంది, ఈబీసీ విద్యార్థులు 3,723 మంది, వికలాంగులు 8 మంది, మైనారిటీ విద్యార్థులు 221 మంది ఉన్నారు.
బీసీ విద్యార్థుల్లో కేవలం 20,670 మందికి మాత్రమే ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.27 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 46,260 మందికి ఇంకా చెల్లించలేదు. వీరి కోసం రూ.57కోట్లు విడుదల చేయాల్సి ఉంది. వేలాది మంది విద్యార్థుల దరఖాస్తులు ఇప్పటికీ అధికారుల పరిశీలనలో ఉండిపోవటం ఆందోళన కలిగి స్తోంది. దీంతో తల్లిదండ్రులు బెంగ పెట్టు కున్నారు.
జిల్లాలోని కళాశాలల్లో 7,095 మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా వీరిలో 3,400 మందికి ఉపకార వేతనాలు ఇప్పటికీ విడుదల కాలేదు. వీరికోసం సుమారు రూ.2 కోట్లు విడుదల కావాల్సి ఉంది, ఈ మొత్తం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎస్సీ విద్యార్థులు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.