‘బెల్ట్’ జోరు | The high costs of alcohol sales | Sakshi
Sakshi News home page

‘బెల్ట్’ జోరు

Published Thu, Apr 16 2015 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

The high costs of alcohol sales

ఇబ్బడి ముబ్బడిగా షాపులు
వేలం నిర్వహించి మరీ నిర్వహణ
అధిక ధరలకు మద్యం విక్రయాలు
క్వార్టర్ బాటిల్‌కు రూ.10 అదనం
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ

 
మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖ అధికారులు, మద్యం సిండికేట్ వ్యాపారులు ఏకమయ్యారు. మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. మద్యం విక్రయాలను పెంచేందుకు బెల్టుషాపులకు తెరతీశారు. బెల్టుషాపులు మూసివేస్తామని అధికారికంగా ప్రకటించగా వాటి సంఖ్య అధికమైంది తప్ప తగ్గనే లేదు. ఏ గ్రామంలో చూసినా ఒకటికి మించి బెల్టుషాపులు ఏర్పాటుచేసి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. జూన్ 30తో మద్యం షాపుల లెసైన్సు గడువు ముగియనుండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా వ్యాపారులు కథ నడుపుతున్నారు.

కొన్ని రోజులుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి మద్యం సిండికేట్లకు నాయకత్వం వహిస్తూ ఎక్సైజ్ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. మద్యం ధరలు పెంచటం, ఎక్సైజ్ శాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వటం తదితర వ్యవహారాలన్నీ ఈ వ్యక్తికి చెందిన హోటల్‌లోనే జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం బందరు మండలం కోన గ్రామంలో బెల్టుషాపులు నిర్వహించేందుకు వేలం పాట నిర్వహించారు.జూన్ 30 వరకు బెల్టుషాపులు నిర్వహించి వ్యాపారం నిర్వహించేందుకు రూ.64 వేలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాట దక్కించుకోవటం గమనార్హం.

అనధికారికంగా అనుమతులు...
జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలో పది బార్ అండ్ రెస్టారెంట్లు, ఏడు మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 300కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. మచిలీపట్నంలోని మద్యం దుకాణాల్లో గత కొన్ని రోజులుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఒక్కొక్క షాపు నుంచి నెలకు రూ.5 వేలు చొప్పున ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్లుగా వసూలు చేసేవారని, ధరలు పెంచిన తరువాత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

మద్యం దుకాణాల్లో ధరలు పెంచి విక్రయాలు చేస్తుండటంపై ఎవరైనా ప్రశ్నిస్తే మంత్రి నుంచి ఎక్సైజ్‌శాఖ అధికారుల వరకు అనుమతులు ఇచ్చారని మద్యం వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. మచిలీపట్నం డివిజన్ పరిధిలో మద్యం సిండికేట్లకు నాయకత్వం వహించే ఓ వ్యాపారికి పట్టణ శివారులోని కాలేఖాన్‌పేటలో ఓ మద్యం దుకాణం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేశారు. అయినప్పటికీ ఈ మద్యం దుకాణం మూసినట్లే ఉంచి మద్యం విక్రయాలు జరిపినా ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.

మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ 50 మీటర్లకు మించి ఉండకూడదు. అయితే ఒక్కొక్క మద్యం దుకాణంలో 300 మీటర్లకు పైగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసి పర్మిట్ రూమ్‌లను నడుపుతున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

ఉన్నవి తొలగించలేదు.. కొత్తవి వెలిశాయి..
సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెల్టుషాపుల తొలగింపు ఫైలుపై సంతకం చేశారు. వాస్తవంలో తొలగించకపోగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంకా అధికంగా బెల్టుషాపులు వెలిశాయి. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరికివారు బెల్టుషాపులు నడుపుతున్నారు. బందరు మండలంలో చిలకలపూడి రైల్వేగేట్ నుంచి పెదపట్నం వరకు 26 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో 50 బెల్టుషాపుల వరకు నడపుతుండటం గమనార్హం. కాలేఖాన్‌పేట నుంచి చిన్నాపురం వైపు మరో 70కి పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మచిలీపట్నానికి అత్యంత సమీపంగా ఉన్న చినకరగ్రహారం పంచాయతీలో బెల్టుషాపులు నిర్వహించేందుకు రూ.15 వేలకు వేలంపాట నిర్వహించి మరీ వ్యాపారం చేయటం గమనార్హం. గ్రామంలో బెల్టుషాపు వద్దని సర్పంచ్ పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు వివరించినా నేటికీ అక్కడ బెల్టుషాపు యథాతథంగా కొనసాగుతూనే ఉంది. పలుమార్లు గ్రామస్తులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా చూస్తాం, అరికడతామని చెప్పటమే తప్ప దాడులు చేసిన ఘటనలు లేనేలేవని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రముఖులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement