‘నాని’ ఐడియా.. !
* సబ్‌మెర్సిబుల్‌గా మోనోబ్లాక్ పంపు
* మెకానిక్ ఆలోచన సక్సెస్
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : వ్యవసాయ బావుల నుంచి నీరు తోడే మోనోబ్లాక్ మోటార్లను నీటిలోపల పనిచేసే ఓపెన్‌వెల్ సబ్‌మెర్సిబుల్ పంపులుగా మారుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు మినుకూరి రమణారెడ్డి(నాని). లోఓల్టేజీ, అధిక వేడిని తట్టుకోలేక మోనోబ్లాక్ మోటార్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతులు సబ్‌మెర్సిబుల్ పంపులుగా మార్చుకుని ప్రయోజనం పొందుతున్నారు.
నెలరోజులు శ్రమించాను
మాది స్టేషన్‌ఘన్‌పూర్. ఐటీఐ పూర్తి చేసి ఇక్కడే ఎనిమిది సంవత్సరాలుగా వైండింగ్ వర్క్ షాపు నడుపుతున్నాను. వ్యవసాయ బావుల నుంచి నీరు తోడే మోనోబ్లాక్ పంపులు పాడైపోతే రైతులు తీసుకొస్తే రిపేరు చేస్తుంటాను. కొందరు తరచూ మోటార్లు కాలిపోయి వైండింగ్ కోసం వస్తూ ఉన్నారు. వాళ్లు పడే కష్టం చెప్పుకునేటోళ్లు. రిపేరు ఖర్చులకు ఇబ్బందిపడుతుండేది. ఆ పరిస్థితుల్లో వారిని చూస్తే చాలా బాధ అనిపించేది. ఏదైనా చేయాలని అనిపించింది. ఆరునెలల క్రితం రెండు మోటార్లను విప్పి అందులో వైండింగ్‌ను పరిశీలించాను.
ఓపెన్‌వెల్ సబ్‌మెర్సిబుల్ మోటారులో ఉండే మాదిరిగా మోనోబ్లాక్ మోటారులో వైండింగ్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమోనని ఒక మోటారును పరీక్షించి చూశాను. నెల రోజుల పాటు దానితో కుస్తీ పట్టాను. ఎట్టకేలకు విజయంతవంతమైంది. రైతులకు చెప్పడంతో మోనోబ్లాక్ మోటార్లను ఓపెన్‌వెల్ సబ్‌మెర్సిబుల్ మోటార్లుగా మార్చుకునేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటివరకు మండల పరిధిలో సుమారు 30 మంది పంపులను మార్చుకుని వినియోగిస్తున్నారు. కొత్తగా ఓపెన్‌వెల్ సబ్‌మెర్సిబుల్ పంపు కొనుగోలు చేయాలంటే కంపెనీని బట్టి దాదాపు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. అదే మోనోబ్లాక్ మోటారును సబ్‌మెర్సిబుల్‌గా మార్చుకుంటే రూ.4వేల లోపు ఖర్చవుతుంది. కంపెనీ మోటారు గంటసేపు తోడే నీటిని ఈ మోటారు పావుగంటలో తోడుతుంది. -నాని, మెకానిక్
బాగా పనిచేస్తోంది
నాకు 9 ఎకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న పంటలు వేశాను. మోనోబ్లాక్ మోటారు తరచూ కాలి పోవడం, వైండింగ్ చేయించడానికి డబ్బు చాలా ఖర్చయ్యేది. మోనోబ్లాక్‌ను తక్కువ ఖర్చుతో సబ్‌మెర్సిబుల్‌గా మార్చుతున్నారని తెలిసి చేయించి బావిలో ఫిట్ చేశాను. బాగా పనిచేస్తోంది.
-పి.రమణారెడ్డి, రైతు, మల్కాపూర్
మొదట నమ్మలేదు
నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న వేశాను. పలుమార్లు మోనోబ్లాక్ మోటారు కాలిపోయిం ది. ఓపెన్‌వెల్ సబ్‌మెర్సిబుల్‌గా మార్చుకోవచ్చని కొందరు రైతు లు చెబితే మొదట నమ్మలేదు. వారి మోటార్లను చూసిన తర్వాత నాని దగ్గరకొచ్చి చేయించిన. నీళ్లు మంచిగ పోస్తంది.
- ముదావత్ శంకర్, రైతు, లింగంపల్లి