ఆదర్శ రాష్ట్రంగా ‘ఆంధ్ర’
మంత్రి రావెల కిషోర్‌బాబు
కొరిటెపాడు (గుంటూరు) : నవ్యాంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు. కొరిటెపాడు సాయిబాబా రోడ్డులోని ఓ హోటల్‌లో బుధవారం జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో రెండేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి రావెల ప్రారంభించారు. అనంతరం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతిపై ప్రచురించిన పుస్తకాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్‌తో కలసి ఆయన ఆవిష్కరించారు.
సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలి పారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక నిధులను చిత్తశుద్ధితో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయిస్తున్నట్లు వివరించారు. తూరుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు దూబి భద్రయ్య ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారని, ఈ యువకుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, కమిషనర్ నాగలక్ష్మి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, లాల్‌వజీర్ తదితరులు పాల్గొన్నారు.