ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం | the job fraud to peoples | Sakshi

ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

May 10 2014 2:49 AM | Updated on Sep 2 2017 7:08 AM

పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ జిల్లా కేంద్రంలో హోంగార్డుగా పని చేస్తున్న పుష్పగిరిపై గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన బి.వీరేష్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

 కర్నూలు, న్యూస్‌లైన్:  పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ జిల్లా కేంద్రంలో హోంగార్డుగా పని చేస్తున్న పుష్పగిరిపై గూడూరు మండలం చనుగొండ్లకు చెందిన బి.వీరేష్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం తన వద్ద లక్ష రూపాయలు తీసుకున్నాడని, డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్పీ రఘురామిరెడ్డి నిర్వహించిన మీతో మీఎస్పీ కార్యక్రమానికి ఫోన్ (94407 95567) ద్వారా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పించకపోతే డబ్బు వాపసు ఇవ్వాలని అడిగినప్పటికీ ఇప్పుడు, అప్పుడంటూ తిప్పుకుంటున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 60వేలు ఇచ్చాడని, మిగతా డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

డబ్బు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెబితే నమ్మి మోసపోరాదని, అలాంటి వారి సమాచారం తన దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన నసీరుద్దీన్ పటేల్ ఎస్పీని కోరారు. నెహ్రూ రోడ్డు నుంచి బుడేకల్ రోడ్డు వరకు, హసన్న పేట నుంచి మునిసిపల్ మెయిన్ రోడ్డు వరకు వన్‌వే ఏర్పాటు చేస్తే ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రించవచ్చని ఆయన సూచించగా స్థానిక పోలీసులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇందుకు సంబంధించి నివేదిక అందజేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మీతో మీఎస్పీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు
 
 ఎస్పీకి దుర్వేశి గ్రామస్తుల అభినందన..
 ఈ నెల 7వ తేదీన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారంటూ గడివేముల మండలం దుర్వేశి గ్రామానికి చెందిన ప్రజలు ఎస్పీని అభినందించారు. గతంలో జరిగిన మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎస్పీ ముందస్తు చర్యలు ఫలితంగా ప్రశాంతంగా పూర్తయ్యాయని గ్రామానికి చెందిన  స్వామిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement