పులకించిన భక్తజనం
సాక్షి, కడప/వల్లూరు :
నదీమ తల్లుల ఒడిలో జనాలు పులకరించిపోయారు....పుష్కరాల్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టకపోయినా జనం మాత్రం కృష్ణా జలంతో పుణ్యస్నానాలు ఆచరించి పులకరించిపోయారు. దాదాపు వారం రోజులుగా కష్ణా జలాల రాకతో నదుల వద్ద భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. ఊహించని జనంతో నదీ పరవశించింది. ఎక్కడ చూసినా నదిలో స్నానం చేస్తున్న జనాలతోపాటు మహిళలు ప్రత్యేకంగా ఇసుక కుప్పలతో దేవుని ఆకారం తయారు చేసి పసుపు, కుంకుమ పూసారు. దీపాలు వెలిగించి మనసారా వేడుకున్నారు. కొంతమంది మహిళలు నీటిలో జ్యోతులు వెలిగించి తాంబూళంపై పెట్టి అలా వదిలి నమస్కరించుకున్నారు. రాకరాక వచ్చిన పుష్కరాల్లో భాగంగా ఎక్కడో వెళ్లి స్నానాలు చేసే భాగ్యం లేకపోయినా అవకాశమున్న ప్రాంతంలో పారుతున్న కష్ణా నీటిలోనే స్నానాలు ఆచరించి పరవశించిపోయారు. కష్ణమ్మ ఒడిలో జలకాలాడుతూ....దేవుడికి ప్రణామాలు చేస్తూ భక్తి పారవశ్యంతో భక్తులు మునిగిపోయారు.
భక్తులతో పోటెత్తిన పుష్పగిరి, కుందూ, సిద్దవటం, ఒంటిమిట్ట
జిల్లాలోకి వారం రోజుల క్రితం కష్ణాజలాలు ప్రవేశించాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వదలగానే దిగువకు వచ్చిన నీటితో జిల్లాలో ఒకప్రక్క కుందూలో, మరోప్రక్క కేసీ కెనాల్, ఇంకోప్రక్క పెన్నాలో ఇలా నీరు ప్రవహించంతో ఎక్కడికక్కడ జనాలు పుష్కర స్నానాలు చేసి భక్తిప్రవత్తులను చాటుకున్నారు. ప్రధానంగా దక్షిణకాశీగా పేరొందిన పుష్పగిరి భక్త జనంతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఎక్కడ చూసినా నది వెంబడి పుష్కర స్నానాలు చేస్తూ భక్తులు కనిపించారు. అనంతరం చెన్నకేశవస్వామిని దర్శించేందుకు భారీగా క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. చెన్నూరు సమీపంలోని ఆలయం వద్ద కూడా పెన్నానదిలో స్నానాలు పెద్ద ఎత్తున ఆచరిస్తూ కనిపించారు. మరోప్రక్క కొండపేట వద్ద కూడా కిక్కిరిసిన జనాలతో వస్తున్న వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చాపాడు మండలంలోని కుందూలో భాగంగా వీరభద్రస్వామి ఆలయ సమీపంలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఒంటిమిట్ట మండలంలోని దర్జిపల్లె వద్ద పెన్నాలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, సిద్దవటం వద్దనున్న పెన్నా వంతెన వద్ద కూడా ఊహించని జనం పుష్కర స్నానాలతో పులకరించారు.
మూడు లక్షల మందికి పైగా పుష్కర స్నానం
జిల్లాకు సంబంధించి వేలాది మంది కష్ణా పుష్కరాల్లో భాగంగా పలు ఘాట్లకు వెళ్లి స్నానాలు చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం, కష్ణానది, పున్నమి ఘాట్, అమరావతి తదితర ప్రాంతాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. వారం రోజులుగా జిల్లాలో పలుచోట్ల కేసీ కెనాల్, కుందూ, పెన్నా నదుల్లో పారుతున్న కష్ణా నీటిలో స్నానాలు చేసి దేవుడిని స్మరించుకున్నారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా వివిధ ప్రాంతాల్లో స్నానాలు చేసినట్లు అంచనా. దాదాపు ఈ వారం రోజుల్లో ఇతర జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడు లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.