- రెగ్యులర్ ఎంఈవోలు పది మందే..
- మిగిలిన మండలాలకు ఇన్‌చార్జులే దిక్కు...
- ఐదు డివిజన్ల డీవైఈవోలూ ఇన్‌చార్జులే!
- విద్యా వ్యవస్థపై కొరవడిన పర్యవేక్షణ
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాను విద్యా శాఖ అధికారుల కొరత వేధిస్తోంది. మొత్తం 49 మండలాలకు గానూ పది మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన 39 మండలాలకు ఇన్‌చార్జిలే ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలోని ఐదు డివిజన్లకూ డీవైఈవోలు ఇన్‌చార్జిలే కావడం విశేషం. దీంతో పాఠశాలల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. విద్యా ప్రణాళికల అమలును పట్టించుకునే వారే కరువయ్యారు. ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా చేసేవారు, పిల్లలకు అందాల్సిన సదుపాయాల గురించి ప్రశ్నించే వారే లేకుండాపోయారు.
అధికారులతో బానిసత్వం...
జిల్లా విద్యాశాఖలోని అధికారులతో ప్రభుత్వం బానిసత్వం చేయించుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక అధికారికి జీతమిచ్చి.. ఎక్కువ ప్రాంతాల్లో బాధ్యతల్ని అప్పగించి వెట్టిచాకిరి చేయించుకోవటంతో కొంతమంది అధికారులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం పోస్టులు భర్తీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఎంఈవోలు చెబుతున్నారు.