నామమాత్రపు పాత్ర | The main opposition Telugu Desam Party was nominally part. | Sakshi
Sakshi News home page

నామమాత్రపు పాత్ర

Published Fri, Aug 9 2013 3:33 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

The main opposition Telugu Desam Party was nominally part.

సాక్షిప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల పాత్ర నామమాత్రంగా మారింది. ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఆ రెండు పార్టీల నాయకులు అప్పుడప్పుడు తళుక్కున మెరిసి మాయమవుతున్నారు. జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో కీలకమైన నేతల తీరుతో ఆ పార్టీల కార్యకర్తలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ముందుకు వెళితే ఎటువంటి సమస్యలు వస్తాయోనన్న భయం వారిని వెంటాడుతోంది.
 
 ముఖ్యంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఉపసంహరించుకునేలా కార్యకర్తలు ఒత్తిడి తేవాలంటూ ప్రకటించడం వారిని అయోమయానికి గురిచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి అటువంటి ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం తెలియక వారు మదనపడుతున్నారు.
 
 సమైక్యాంధ్ర కోసం ఒకవైపు జిల్లాలో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వస్తుంటే మంత్రి వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ నేతలనే రాజీనామాలు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలన్న తర్వాత తాము  ఏ ముఖం పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ ముఖ్యుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము ఉద్యమంలో పాల్గొన్నా జనం నమ్మరని అభిప్రాయపడ్డారు. శాసనసభ్యత్వాలకు రాజీనామాలు ప్రకటించిన ఎమ్మెల్యేల పాత్ర కూడా పెద్దగా లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి రాజధానికి పరిమితం కాగా రెండు రోజుల కిందట నెల్లూరు వచ్చిన ఆనం వివేకానందరెడ్డి, శ్రీధరకృష్ణారెడ్డి మొక్కుబడిగా పాల్గొంటున్నారు.
 
 ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు సమైక్య నినాదం వల్లిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం విషయానికి వస్తే తర్జనభర్జనల తర్వాత రాజీనామాల డ్రామాకు తెరతీసిన టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అధికారపక్షం బాటలోనే పయనిస్తున్నారు. అంటీముట్టనట్టుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆజ్ఞల కోసం ఆ పార్టీ ముఖ్యులు వేచిచూస్తున్నారు. రాష్ట్ర విభజనకు పార్టీ హైకమాండ్ అంగీకరించినందున ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్నామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా పార్టీకి పెద్దదిక్కు అయిన సోమిరెడ్డి రాజధానిలో కూర్చుని విలేకర్ల సమావేశాలకు పరిమితం అయ్యారు. గతంలో సమైక్యాంధ్ర గళం వినిపించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనల్లో కనిపించడం లేదు.
 
 అగ్రభాగంలో వైఎస్సార్సీపీ
 జిల్లాలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
 
 ఎన్‌జీవోలు, విద్యార్థి జేఏసీ, విక్రమ సింహపురి యూనివర్సిటీ సిబ్బంది, పలు ప్రజాసంఘాలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వ కార్యకాలపాలతో పాటు జనజీవనం పూర్తిగా స్తంభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement