హత విధీ.. ఇదేమి వారధి
► చెక్క వంతెనతో చిక్కులు
► అదుపు తప్పితే నదిలో పడాల్సిందే
► వారం రోజుల క్రితం నదిలో పడిన మహిళలు
► సమీపంలోని రైతులు రక్షించడంతో తప్పిన ప్రమాదం
► పట్టించుకోని పాలకులు, అధికారులు
రాంబిల్లి(యలమంచిలి): మండలంలోని మూలజంప గ్రామంలో సుమారు 2 వేల మంది ఉంటున్నా రు. వీరిలో అధికశాతం మంది వ్యవసాయదారులే. పశువుల పాకల వద్దకు, పంటపొలాలకు వెళ్లాలంటే నదిని దాటాల్సిందే. దీంతో ఏటా గ్రామస్తులు చందా లు వేసుకొని తాటి చెక్కలతో వంతెన నిర్మించుకుంటారు. ప్రమాదమని తెలిసినా మరో మార్గం లేక ఈ చెక్క వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఏళ్ల తరబడి ఈ సమస్యతో సతమతమవుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకొచ్చినా పట్టిం చుకోలేదంటున్నారు. చెరకు క్రషర్లు శారద నది ఆవల ఉండడంతో రాత్రిళ్లూ ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగి స్తుంటారు.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ చెక్కలపై రాకపోకలు సాగించేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు.
వారం రోజుల క్రితం చెక్క విరిగి పోయి 10 మంది మహిళలు నది లో పడిపోయారు. అప్పట్లో తక్కువగా నీరు ఉండటంతో పాటు అక్కడే ఉన్న రైతు వి.రాముతోపాటు మరికొందరు స్పందించి వెంటనే నదిలోకి దిగి మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మహిళలు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల ఒక తెప్పను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని నిర్వహించే వారు లేకపోవడంతో ఒడ్డున వృథాగా పడి ఉంది.