బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం.
స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది.
సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్
ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు.
మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ
భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత
సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి
దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు.