తెలుగుదేశంలో చేరికలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. వెనకాముందూ చూడకుండా పార్టీలో అందరికీ గేట్లు తెరిచేయడంతో నాయకులు కార్యకర్తలు కంగు తింటున్నారు. అధినేత ధోరణితో వీరంతా మండిపడుతున్నారు. మాజీ మంత్రి గంటా చేరికతో భగ్గుమన్న తెలుగుదేశంలో వుడా మాజీ వీసీ రెహమాన్ తాజాప్రవేశం
ఆ పార్టీ నగరనేతవాసుపల్లికి గట్టిషాకే ఇచ్చింది.
విశాఖపట్నం : అర్బన్ తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. గంటా చేరికతో ఓ పక్క అయ్యన్న ఆగ్రహంతో రగిలిపోతుంటే తాజాగా వుడా మాజీ చైర్మన్ రెహమాన్ తెలుగుదేశంలో చేరడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. సాక్షాత్తూ ఆ పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఈ చేరిక షాకిచ్చినట్టయింది.
దక్షిణ నియోజక వర్గంలో మత్స్యకార నేతగా ముద్రపడి పనిచేసుకుపోతున్న ఈయనకు రెహమాన్ చేరిక మింగుడు పడటం లేదు. అధినేత చంద్రబాబునాయుడు తీరుపై వాసుపల్లి వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు.