నంద్యాలటౌన్:స్వయం ఉపాధి కోసం వచ్చిన యువతిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు ఓ ప్రభుత్వోద్యోగి. పెళ్లయి, పిల్లలున్న ఆ ప్రబుద్దుడు ఏడాదిగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అతడు అనుమానంతో పెడుతున్న వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి అనుమానాస్పద రీతిలో తనువు చాలింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మూలసాగరంలో వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తే కొట్టి చంపాడని మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గడివేముల మండలం బూజునూరుకు చెందిన ఎల్లమ్మ (25)అలియాస్‌శాంతి తండ్రి సుబ్బరాయుడు 8ఏళ్లక్రితమే మరణించాడు. ఎల్లమ్మకు తల్లి లక్ష్మీదేవి, నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన ఎల్లమ్మ కుటుంబ పోషణ నిమిత్తం స్వయం ఉపాధి కింద మీ-సేవా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి యత్నించింది. ఈ విషయమై దాదాపు ఏడాదిన్నర క్రితం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చింది.
ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాగాంజనేయులు (40) తాను సాయం చేస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెకు మూలసాగరంలో మీ-సేవ కేంద్రం ఏర్పాటు చేయించడంతో గుడ్డిగా అతడిని ఆమె నమ్మింది. అన్నీ తానే చూసుకుంటానంటూ నాగాంజనేయులు మీ-సేవా కేంద్రం ఉన్న భవనంలోని మూడో అంతస్తులో ఎల్లమ్మతో సహజీవనం చేశాడు. వాస్తవానికి అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కానీ నాగాంజనేయులు ఎల్లమ్మ ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధించేవాడు. ఈ నేపథ్యంలో, ఆమె మంగళవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంటి తలుపులు రాకపోవడంతో నాగాంజనేయులు, మరికొందరు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఉరి వేసుకున్న స్థితిలో ఉన్న ఎల్లమ్మను కిందకు దించారు.
అప్పటికే ఆమె మరణించి ఉంది. ఇది స్థానికులకు తెలియడంతో నాగాంజనేయులును పట్టుకొని చితకబాదడంతో అతను పరారయ్యాడు. మృతురాలి సోదరి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగాంజనేయులే తన భార్యతో కలిసి హతమార్చాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీటౌన్ సీఐ దైవప్రసాద్, ఎస్‌ఐ సూర్యమౌళి విలేకరులకు తెలిపారు.
యువతి అనుమానాస్పద మృతి
Published Wed, Nov 12 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement