విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తాళపరెడ్డి కోదండరాం(15) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపురానికి చెందిన అప్పారావు, లక్ష్మి దంపతుల కుమారుడైన కోదండరామ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.
గురువారం ఉదయం పాఠశాల విద్యార్థులందరూ వనభోజనాలకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం నుండి అతను కనిపించలేదు. బడి వదిలినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితులను వాకబుచేశారు. మధ్యాహ్నం నుంచి కనిపించలేదని వారు చెప్పడంతో పాఠశాల పరిసరాల్లో, వనభోజనాలకు వెళ్లిన ప్రదేశంలో వెతికారు. పాఠశాల సమీపంలో బోరు బావి వద్ద గుంతలో విగతజీవుడై పడిఉన్న కోదండరామ్‌ను కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతుని గొంతుపై నులిమినట్లు గుర్తులున్నాయి. శరీరంపై అక్కడక్కడా దెబ్బలు ఉన్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.