ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి
సుండుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీఓలతో ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎస్టీయూ మండలశాఖ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీయూ రాయచోటి రీజినల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల వేళలు పెంచడంతో ఉపాధ్యాయులకు అదనపు భారం పెరుగడంతోపాటు, మానసిక వత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 3 కిలో మీటర్లలోపు పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేసి క్లస్టర్ పాఠశాలగా పెట్టాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను ఎస్టీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వ కొత్త విధానాల వల్ల ఉపాధ్యాయ పోస్టులకు గండి పడడమే కాక ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక ఉర్దూ, డిగ్రీ కళాశాలను తప్పకుండా ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్టీయూ సర్వసభ్య సమావేశంలో మండల స్థాయి ఆర్థిక, కార్యకర్తల రిపోర్టు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ మెడలు వంచాలంటే ఉపాధ్యాయ సంఘాలన్ని కలిసి పోరాటం చేయాలన్నారు.
ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తుంచుకొని నిరుపేదల విద్యాభివృద్ధికి నిత్యం కృషి చేయాలన్నారు. అనంతరం సుండుపల్లెనుంచి రాయచోటికి బదిలీ అయిన ఎంఈఓ రామకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులైన సురేందర్ రెడ్డి, సత్యరాజ్, హాజిరా, రవీంద్రనాయక్‌తో పాటు మండలంలో ఎస్టీయూ స్థాపనకు కృషి చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బ రామరాజు, సదాశివరాజును సన్మానించారు.
సమావేశంలో ఎస్టీయూ ఉర్దూ వింగ్ రాష్ట్ర కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర మాజీ సంయుక్త అధ్యక్షులు పిసి రెడ్డన్న, సంయుక్త అధ్యక్షులు సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు సజ్జల రమణారెడ్డి, లెక్కల జమాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామలింగరాజు, సంయుక్త అధ్యక్షులు హైదర్‌అలి, ప్రధానోపాధ్యాయులు నాగమునిరెడ్డి, చిన్నప్పరెడ్డి, చక్రే నాయక్, పాల కొండమ్మ, రవీంద్ర నాయక్, ఆరిఫుల్లా, రాయచోటి రీజనల్ ఎస్టీయూ సభ్యులు పాల్గొన్నారు.
కొత్త జీఓలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
Published Mon, Nov 24 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement