చిత్తూరు (అర్బన్): కుక్క మనిషిని కొరికితే సంచలనం కాదు.. అదే కుక్కను మనిషి కొరికితే సంచలనం. ఇలాంటి సంఘటనే చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్కను స్థానికులు విషం పెట్టి చంపేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చనిపోయిన కుక్కను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించిన పోలీసులు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి చిత్తూరు వన్‌టౌన్ ఎస్‌ఐ లక్ష్మీకాంత్ కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని భరత్‌నగర్ కాలనీకు చెందిన చిట్టి అనే మహిళ ఓ డాబర్‌మెన్ కుక్కను పెంచుకుంటోంది. కుక్క పేరు అమ్ముకుట్టి. 22 నెలల వయస్సు.
అమ్ముకుట్టి తరచూ రోడ్డుపైకి వచ్చి స్థానికంగా ఉన్న వాళ్లను కొరికేసేది. దీనిపై 15 రోజుల క్రితం అమ్ముకుట్టి బాధితులు చిట్టి ఇంటి వద్దకు వెళ్లి హెచ్చరించారు. కుక్క అందర్నీ కొరుకుతోందని, కట్టేసి ఉంచుకోవాలని హెచ్చరించారు. అయితే గురువారం ఉదయం తన ఇంటి వద్ద అమ్ముకుట్టి (కుక్క) నోట్లో నుంచి నురగలు రావడం చూసిన దాని యజమానికి హుటాహుటిన పశువుల వైద్యశాలకు తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు దీనికి చికిత్స చేస్తుండగా మృతి చెందింది. తన కుక్కకు స్థానికులు విషం కలిపిన ఆహారం పెట్టి చంపేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని చిట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.10 కంటే ఎక్కువ ఖరీదు ఉన్న జీవుల్ని చంపడంతో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 428 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టానికి పంపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ లక్ష్మీకాంత్ పేర్కొన్నారు.