♦ టీడీపీ ఎమ్మెల్యేని అరెస్టు చేయండి
♦ రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన
♦ నల్లబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొన్న అధికారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాటపట్టారు. మహిళా తహశీల్దార్‌పై దాడిచేసిన ఎమ్మెల్యేని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద అక్రమంగా ఇసుకను తరలించడాన్ని అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షి, ఆర్‌ఐపై టీడీపీ ఎమ్మెల్యే విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనపై జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
తహశీల్దార్‌పై దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఏపీఆర్‌ఎస్‌ఏ, ఎస్‌ఆర్‌ఎస్‌ఏ నాయకులు ఆందోళన చేశారు. నెల్లూరు రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కలిగిరి, ఉదయగిరిల్లో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ ఎంప్లాయీస్ టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఆందోళన చేశారు.
కావలి పరిధిలో రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో ఆర్డీఓ, తహశీల్దార్లు, సిబ్బంది నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు మండల రెవెన్యూ ఉద్యోగులు టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యేని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఏఎస్‌పేట, మర్రిపాడు, సంగం, చేజర్ల మండల కార్యాలయాల వద్ద రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో డక్కిలిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. గూడూరులో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు మద్దతుగా పలుచోట్ల వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపారు.
అధికార జులుంపై నిరసన
Published Sat, Jul 11 2015 2:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement