'పాత పద్ధతిలోనే ధాన్యం సేకరణ'
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విధానాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వైఎస్సార్‌సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘దేశంలోని 60 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా రైతులు తమ ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్ముకోవాలనుకుంటున్నారు. అక్కడైతే కనీస మద్దతు ధర లభిస్తుందని వారి ఆశ. అయితే ప్రస్తుతం ఉన్న లెవీ విధానం ద్వారా ధాన్యాన్ని సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే కనుక అమలైతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మిల్లర్లు, వర్తకుల నుంచి కనీస మద్దతు ధర లభించే పరిస్థితి ఉండదు. ఇది రాష్ట్రాలపైనా పెను ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా ఎక్కువగా పండించే రాష్ట్రాలపైన, ఎక్కువ వినియోగం ఉండే రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అవి పండించే ధాన్యంలో దాదాపు 80 శాతాన్ని వినియోగించుకుంటాయి. ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ధాన్యాన్ని పండించుకున్నప్పటికీ.. ఎక్కువగా వినియోగించుకోవు. అలాగే పశ్చిమబెంగాల్, అస్సాం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఒడిశా, తదితర రాష్ట్రాలపైనా ప్రతిపాదిత విధానం ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ తాజా యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. అలాగే 75 శాతం వరకు రైతుల నుంచే సేకరించేలా పాత నిబంధనలను కొనసాగించాలి..’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.