
రుణమాఫీ తీరుపై జనాగ్రహం
సాధికార సదస్సుల్లో నిలదీసిన రైతులు
జాబితాలో పేర్లు లేవని మండిపాటు
బ్యాంకుల వద్ద ఆందోళనలు
చిత్తూరు: రైతురుణమాఫీ అమలు తీరుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నెల 11 నుంచి 16 వతేదీ వరకు ప్రభుత్వం గ్రామపంచాయతీ స్థాయిలో నిర్వహించిన రైతు సాధికార సదస్సులు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రుణమాఫీ పత్రాలను అందించేందుకు వెళ్లిన అధికారులను రైతు లు అడుగడుగునా నిలదీశారు. ఎన్నికల్లో చెప్పిందేమిటి? ఇప్పుడు చేసిందేమిటి ? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షా ఏభై వేలు రుణం తీసుకుంటే..’ 10వేలు 12 వేలు మాఫీ చేస్తారా! అంటూ ప్రశ్నించారు. అర్హుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. తొలుత సదస్సుల్లో కొన్ని చోట్ల రైతులు నిలదీయడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. రెండో జాబితాలో మీ పేర్లు వస్తాయం టూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చాలా గ్రామాలకు అధికారులు వెళ్లిన పాపాన పోలేదు. కొన్ని చోట్ల రుణమాఫీ పత్రాలు మీరే ఇవ్వండంటూ రెవెన్యూ కార్యదర్శులకు అప్పగించగా, మరికొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్ల స్వాధీ నం చేసినట్లు సమాచారం. మరికొందరు అధికారులు మాఫీ పత్రాలు రైతులకు మీరే ఇవ్వండంటూ ఆయా బ్యాంకుల్లోనే అప్పగించారు.
కుప్పం మండలంలోని గుడ్లనాయనిపల్లెలో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమేకాక సదస్సును అడ్డుకున్నారు. అధికారులు రుణమాఫీ పత్రాలను స్థానిక వీఆర్వోకు అప్పజెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కుప్పం మండలం వానగుట్టపల్లె గ్రామ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. ఇష్టానుసారం రుణమాఫీ చేస్తారా..! అంటూ విరుచుకుపడ్డారు. అధికారులు సదస్సు నిర్వహించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు లో జరిగిన రైతు సదస్సులోనూ అధికారులను రైతులు నిలదీశారు. అక్కడి కార్పొరేషన్ బ్యాంకు,ఎస్‌బీఐ ఎదుట ఆందోళన నిర్వహించారు.
పలమనేరు మండలంలోని టీ.వడ్డూరులో రైతులు రుణమాఫీపై అధికారులను నిలదీశారు. పుంగనూరు మండలం సోమలలో రైతులు అధికారులను అడ్డుకోవడంతో పాటు రుణమాఫీ జాబితా తప్పులతడకగా ఉందంటూ బ్యాంకువద్ద ధర్నా చేశారు. రుణమాఫీ పత్రాలు బ్యాంకుల్లో చెల్లుబాటుకావని బ్యాంకు అధికారులే చెబుతున్నారని అలాంటపపుడు ఈ పత్రాలు ఎందుకిస్తున్నారని పూతలపట్టు నియోజకవర్గంలో రైతులు నిలదీశారు. విజయపురం మండలంలో మంగళవారం చివరి రోజు జరిగిన రైతు సాధికారిక సదస్సులో రుణమాఫీ జాబితాలో మా పేర్లేవంటూ రైతులు అధికారులను గట్టిగా ప్రశ్నించడంతో వారు తరువాత జాబితాలు ఉన్నాయని, వాటిలో మీ అందరి పేర్లు వస్తాయంటూ నమ్మబలికి అక్కడి నుంచి ఎలాగో లా బయటపడ్డారు.