సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్న తరుణంలో పార్టీలో స్తబ్ధత నెలకొనడం టీఆర్‌ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో తెలంగాణ ప్రకటనకు ముందు ఉన్న ఉత్సాహం క్యాడర్‌లో కనిపించడం లేదు. పార్టీలోకి వలసలు లేకపోగా.. కొంతమంది నేతలు పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆలూరు గంగారెడ్డి బీజేపీలో, కామారెడ్డికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. వారి వెంట మరికొందరు నేతలు సైతం పార్టీలు మారారు. జిల్లాలోని మరి కొన్ని ప్రాంతాల్లో పలువురు వలసలకు ప్రయత్నించి, వెనక్కు తగ్గిన దాఖలాలున్నాయి. దీనికంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రకటన తర్వాత టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనిని పార్టీ అధినేత ఖండించినా అదే ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. దీనినుంచి బయటపడేందుకు జిల్లా నాయకత్వం పడరానిపాట్లు పడుతోంది.
టికెట్టు దక్కుతుందో లేదో..
నియోజక వర్గ స్థాయి నేతల్లో మరో అనుమానం తిష్టవేసుకుంది. కష్టపడి పార్టీని అభివృద్ధి చేసినా, ప్రజాసమస్యలపై ఆందోళనలు నిర్వహించినా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టు లభిస్తుందా అన్న సమస్య వారిని వేధిస్తోంది. గత అనుభవాలు వారిని వెనకంజ వేయిస్తున్నాయి. టికెట్ల విషయమై స్పష్టత లేకపోవడంతో నాయకులెవరూ పార్టీ కార్యక్రమాలపై ఉత్సాహంగా పనిచేయడం లేదని జిల్లా స్థాయి నాయకుడొకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. పార్టీ జిల్లా పగ్గాలను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆలూరు గంగారెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి మూడు నెలలు అవుతున్నప్పటికీ కొత్తవారిని నియమించ లేకపోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పైగా జిల్లాపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత, అధినేత తనయుడు కేటీఆర్ ప్రభావం కూడా బాగానే ఉంది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కవిత రంగంలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే కవితకు అనుచరవర్గంగా వ్యవహరిస్తున్న నేతలకు పార్టీ జిల్లా శాఖలో పెద్ద పీట లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా మిగతా నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రభావం ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కామారెడ్డి నియోజక వర్గంతో పాటు పలు ప్రాంతాల్లోని పార్టీ వర్గాల్లో చోటుచేసుకున్న వివాదాలు, అధిపత్య పోరుల పరిష్కారంలో ఈ ఇద్దరి నేతల పాత్ర గణనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ ఆధిపత్య పోరు సాగుతున్నట్లు సమాచారం.
కారుకు సారథి కావలెను
Published Wed, Nov 13 2013 6:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement