Ganga Reddy
-
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం
జగిత్యాల జిల్లా: జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బత్తిని సంతోష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిందితుడి వివరాల్ని వెల్లడించారు. నిందితుడు సంతోష్ గ్రామంలో గీతకార్మికుడు. నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. 15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాదా కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టించింది కూడా గంగారెడ్డే. కొద్ది రోజుల క్రితం కేసు విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు సంతోష్ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంగారెడ్డి,సంతోష్ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి గంగారెడ్డిపై సంతోష్ కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం బైక్‌పై హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం హత్య ఎస్పీ తెలిపారు. నిందితుడి వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వివరించారు.ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డిని 20 ఏళ్ల వయస్సున్న సంతోష్ అనే యువకుడు దారుణంగా హత మార్చాడు. పథకం ప్రకారం ముందుగా హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్న గంగారెడ్డిని వెంటాడి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన గంగారెడ్డిపై 20కిపైగా కత్తిపోట్లు పొడిచాడు. హత్య చేసి పారిపోతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. కొన ఊపిరితో ఉన్న ఆయనను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి
జగిత్యాల: ‘అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి. ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఎన్జీవో పెట్టుకోనైనా ప్రజలకు సేవ చేస్తా..’అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ చంపిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవ చేస్తే మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. గంగారెడ్డి హత్యతో ఆందోళనకు దిగిన జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలకు రాగా ‘నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఇకనైనా బతకనివ్వండి..’అంటూ దండం పెడుతూ వ్యాఖ్యానించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయ త్నించగా మధ్యలోనే ఫోన్ కట్ చేశారు. పార్టీకి ఎంతో సేవ చేశా ‘ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న. అయినా బీఆర్ఎస్ వైఫల్యాలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతుల సమస్యలు ఇలా అన్నీ లేవనెత్తి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నా స్థానం ఎక్కడో ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో అవమానాలు తట్టుకుంటున్నాం. ఇక ఓపిక లేదు. బీఆర్ఎస్ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని, తట్టుకొని నిలబడితే.. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో ఈరోజు జగిత్యాలలో ఎలాంటి పరిస్థితులున్నాయో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. మానసిక అవమానాలకు గురయ్యాం. అది చాలదన్నట్టు భౌతికదాడులకు తెగబడుతున్నారు’అంటూ జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమా? బీఆర్ఎస్ ప్రభుత్వమా? ఇప్పుడు తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామో.. లేక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలకు నైతిక విలువ లు ఉండాలని సూచించారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూ సి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆయన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. మా స్థానం ప్రశ్నార్థకం కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని, భౌతిక దాడులు చేస్తున్నారని, నాటి టీఆర్ఎస్.. ఈనాటి కాంగ్రెస్ ముసుగులో ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. మానసిక వేదనకు గురవుతున్నామని, కార్యకర్తలు కూడా నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిందే తాము చేస్తామంటే మన నాయకుడు కేసీఆర్ కాదని, రాహుల్‌గాంధీ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇలాంటివే ఎదురవుతాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మూడో స్థానంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. -
ఎరువుల కొనుగోళ్లకు సమాయత్తం
ఖమ్మం వ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఎరువుల కొనుగోళ్లకు రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ 23వ పాలకవర్గ సమావేశం సోమవారం ఖమ్మంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాది వానాకాలంలో 4.57 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుత యాసంగికి 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరముంటుందని వెల్లడించారు. దీంతో పలు కంపెనీల నుంచి కొనుగోలుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే కనీస మద్దతు ధరతో పెసలు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,397 మెట్రిక్ టన్నుల పెసలు, 4 వేల మెట్రిక్ టన్నుల మినుముల కొనుగోళ్లకు అనుమతించిందని, ఈ పంట కొనుగోళ్లపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని గంగారెడ్డి పేర్కొన్నారు. కనీస మద్దతు ధరతో 72,387 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలుకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ యాదిరెడ్డి, డైరెక్టర్లు రంగారావు, విజయ్, గంగాచరణ్, జగన్మోహన్రెడ్డి, మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
మొగిపురుగు.. తొలిచేస్తోంది
ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు. లక్షణాలు కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది. నివారణ చర్యలు పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. -
మోడీతోనే దేశప్రగతి
భిక్కనూరు, న్యూస్‌లైన్ : నరేంద్రమోడీ ప్రధాని అయితే మనదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిగల దేశంగా రూపొందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపల్లి విఠల్‌గుప్తా తలపెట్టిన నియోజకవర్గ పాదయాత్ర మంగళవారం భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయం వద్ద ప్రారంభమైంది. ఈ యాత్రను పల్లె గంగారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర లో భాగంగా పల్లె గంగారెడ్డి పలుచోట్ల మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు నరేంద్రమోడీ ప్రధాని కావాలని జపం చేస్తున్నారని దేవుడు కరుణించే అవకాశం మెండుగా ఉందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అగ్రరాజ్యంగా నిలిచిపోవడం తథ్యమన్నారు. ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు మోడీ ప్రధాని అయితే తాము చేసిన అక్రమాలు, అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. గ్రామాల్లో బూత్‌లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కార్యకర్తైపైనే ఉందన్నారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వపు నేతలు కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో ఇప్పటి వరకు వారసత్వ రాజకీయాలు లేవన్న సంగతి ప్రజలకు కార్యకర్తలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విఠల్‌గుప్తా పాదయాత్ర చేపట్టి నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ముందుకురావడం అభినందనీయమన్నారు. బీజేపీ నేతలు గంగారెడ్డి, మురళీధర్‌గౌడ్, రంజిత్‌మోహన్, ప్రభాకర్‌యాదవ్, క్రిష్ణాగౌడ్, లింబాద్రి, తున్కివే ణు, యాచం సురేష్‌గుప్తా, డప్పు రవి, పుల్లూరి సతీష్, నర్సింలు, సంజీవరెడ్డి, జిల్లెల రవీందర్‌రెడ్డి, క్రిష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొత్తు పేరుతో టీడీపీ డ్రామా
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : పొత్తు పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీపై నానాటికీ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుండటంతో ఆ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు పార్టీ అధినాయత్వం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీలోకి వలస వెళ్లవద్దని, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్నామని అటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ అబద్దపు ప్రకటనలతో మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో టీడీపీ నాయకులు చేసిన మోసం, పార్టీ అధినాయకులపై చేసిన విమర్శలను తాము మరచిపోలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హైదరాబాద్ ఎలా వస్తారో చూస్తామని సవాల్ చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు అదే మోడీకి దేశవ్యావ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి పొత్తుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు సీమాంధ్రకే పరిమితమని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడా బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కాంగ్రెస్‌పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్రాంతి వరకు ‘బూత్‌దర్శన్’ ఈ నెల 6 నుంచి 10 వరకు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ‘బూత్‌దర్శన్’ కార్యక్రమం నిర్వహించినట్లు పల్లె గంగారెడ్డి తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి వరకు పొడిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ముఖ్యనాయకుల చేరికలు బీజేపీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అలాగే జిల్లా కు చెందిన ప్రముఖ నాయకులు త్వరలో బీజేపీలో చేరే అవకాశాలున్నాయన్నారు. ఇతర పార్టీల ముఖ్యనాయకులు కొందరు బీజేపీలో చేరడానికి జిల్లా, రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని పల్లె గంగారెడ్డి తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, జిల్లా నాయకుడు రాగం రాములు, చింతలపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
కారుకు సారథి కావలెను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతున్న తరుణంలో పార్టీలో స్తబ్ధత నెలకొనడం టీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో తెలంగాణ ప్రకటనకు ముందు ఉన్న ఉత్సాహం క్యాడర్లో కనిపించడం లేదు. పార్టీలోకి వలసలు లేకపోగా.. కొంతమంది నేతలు పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఆలూరు గంగారెడ్డి బీజేపీలో, కామారెడ్డికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. వారి వెంట మరికొందరు నేతలు సైతం పార్టీలు మారారు. జిల్లాలోని మరి కొన్ని ప్రాంతాల్లో పలువురు వలసలకు ప్రయత్నించి, వెనక్కు తగ్గిన దాఖలాలున్నాయి. దీనికంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రకటన తర్వాత టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. దీనిని పార్టీ అధినేత ఖండించినా అదే ప్రచారం సాగుతోంది. దీంతో పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. దీనినుంచి బయటపడేందుకు జిల్లా నాయకత్వం పడరానిపాట్లు పడుతోంది. టికెట్టు దక్కుతుందో లేదో.. నియోజక వర్గ స్థాయి నేతల్లో మరో అనుమానం తిష్టవేసుకుంది. కష్టపడి పార్టీని అభివృద్ధి చేసినా, ప్రజాసమస్యలపై ఆందోళనలు నిర్వహించినా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టు లభిస్తుందా అన్న సమస్య వారిని వేధిస్తోంది. గత అనుభవాలు వారిని వెనకంజ వేయిస్తున్నాయి. టికెట్ల విషయమై స్పష్టత లేకపోవడంతో నాయకులెవరూ పార్టీ కార్యక్రమాలపై ఉత్సాహంగా పనిచేయడం లేదని జిల్లా స్థాయి నాయకుడొకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. పార్టీ జిల్లా పగ్గాలను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆలూరు గంగారెడ్డి టీఆర్ఎస్ను వీడి మూడు నెలలు అవుతున్నప్పటికీ కొత్తవారిని నియమించ లేకపోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పైగా జిల్లాపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత, అధినేత తనయుడు కేటీఆర్ ప్రభావం కూడా బాగానే ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత రంగంలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే కవితకు అనుచరవర్గంగా వ్యవహరిస్తున్న నేతలకు పార్టీ జిల్లా శాఖలో పెద్ద పీట లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా మిగతా నియోజకవర్గాలపై కేటీఆర్ ప్రభావం ఉంటుందన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కామారెడ్డి నియోజక వర్గంతో పాటు పలు ప్రాంతాల్లోని పార్టీ వర్గాల్లో చోటుచేసుకున్న వివాదాలు, అధిపత్య పోరుల పరిష్కారంలో ఈ ఇద్దరి నేతల పాత్ర గణనీయంగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ ఆధిపత్య పోరు సాగుతున్నట్లు సమాచారం.