పొత్తు పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు.
డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : పొత్తు పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీపై నానాటికీ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుండటంతో ఆ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు పార్టీ అధినాయత్వం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశంలో, రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీలోకి వలస వెళ్లవద్దని, బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్నామని అటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ అబద్దపు ప్రకటనలతో మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో టీడీపీ నాయకులు చేసిన మోసం, పార్టీ అధినాయకులపై చేసిన విమర్శలను తాము మరచిపోలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హైదరాబాద్ ఎలా వస్తారో చూస్తామని సవాల్ చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు అదే మోడీకి దేశవ్యావ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి పొత్తుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు సీమాంధ్రకే పరిమితమని, టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడా బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కాంగ్రెస్‌పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
సంక్రాంతి వరకు ‘బూత్‌దర్శన్’
ఈ నెల 6 నుంచి 10 వరకు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ‘బూత్‌దర్శన్’ కార్యక్రమం నిర్వహించినట్లు పల్లె గంగారెడ్డి తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి వరకు పొడిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో ముఖ్యనాయకుల చేరికలు
బీజేపీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీల నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అలాగే జిల్లా కు చెందిన ప్రముఖ నాయకులు త్వరలో బీజేపీలో చేరే అవకాశాలున్నాయన్నారు. ఇతర పార్టీల ముఖ్యనాయకులు కొందరు బీజేపీలో చేరడానికి జిల్లా, రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని పల్లె గంగారెడ్డి తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, జిల్లా నాయకుడు రాగం రాములు, చింతలపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు.