మొగిపురుగు.. తొలిచేస్తోంది | Stems excavate worm in corn | Sakshi
Sakshi News home page

మొగిపురుగు.. తొలిచేస్తోంది

Published Thu, Aug 21 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

Stems excavate worm in corn

 ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు.

 లక్షణాలు
 కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది.
     
ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది.
 
నివారణ  చర్యలు
పొలంలో కలుపు మొక్కలను నివారించాలి.
పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి.
ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి.
     
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement