ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది
ఎన్జీవో పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిసంచలన వ్యాఖ్యలు
గంగారెడ్డి హత్యతో తీవ్ర భావోద్వేగం
జగిత్యాల: ‘అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి. ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఎన్జీవో పెట్టుకోనైనా ప్రజలకు సేవ చేస్తా..’అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఆయన ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ చంపిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవ చేస్తే మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. గంగారెడ్డి హత్యతో ఆందోళనకు దిగిన జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలకు రాగా ‘నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఇకనైనా బతకనివ్వండి..’అంటూ దండం పెడుతూ వ్యాఖ్యానించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయ త్నించగా మధ్యలోనే ఫోన్ కట్ చేశారు.
పార్టీకి ఎంతో సేవ చేశా
‘ఒకప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న. అయినా బీఆర్‌ఎస్ వైఫల్యాలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతుల సమస్యలు ఇలా అన్నీ లేవనెత్తి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నా స్థానం ఎక్కడో ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో అవమానాలు తట్టుకుంటున్నాం. ఇక ఓపిక లేదు.
బీఆర్‌ఎస్ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని, తట్టుకొని నిలబడితే.. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో ఈరోజు జగిత్యాలలో ఎలాంటి పరిస్థితులున్నాయో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. మానసిక అవమానాలకు గురయ్యాం. అది చాలదన్నట్టు భౌతికదాడులకు తెగబడుతున్నారు’అంటూ జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వమా? బీఆర్‌ఎస్ ప్రభుత్వమా?
ఇప్పుడు తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామో.. లేక బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలకు నైతిక విలువ లు ఉండాలని సూచించారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూ సి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆయన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు.
మా స్థానం ప్రశ్నార్థకం
కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని, భౌతిక దాడులు చేస్తున్నారని, నాటి టీఆర్‌ఎస్.. ఈనాటి కాంగ్రెస్ ముసుగులో ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. మానసిక వేదనకు గురవుతున్నామని, కార్యకర్తలు కూడా నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ చేసిందే తాము చేస్తామంటే మన నాయకుడు కేసీఆర్ కాదని, రాహుల్‌గాంధీ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇలాంటివే ఎదురవుతాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో మూడో స్థానంలోకి వెళ్లిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment