ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ ఉపాధి పొందేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు శతవిధాలా కృషి చేస్తోంది. తాజాగా వారిచూపు అంగన్‌వాడీల నియామకాలపై పడింది. ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్‌తో ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది.
ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మహిళా శిశు అభివృద్ధి సంస్థ అధికారులు ప్రకటించారు. పోస్టుల భర్తీకి రీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గత నోటిఫికేషన్‌ను రద్దుచేసి రీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు సీడీపీఓలు మంగళవారం వెల్లడించారు. తమ వారికి అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టులు ఇప్పించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రీ నోటిఫికేషన్ ఇప్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కలవరపాటుకు గురిచేస్తున్న రీ నోటిఫికేషన్...
జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వాటి పరిధిలో ప్రస్తుతం 4,244 అంగన్‌వాడీ కేంద్రాలు, 235 మినీ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమీపంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి వాటిని నెట్టుకువస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఆ మేరకు గత ఏడాది నవంబర్ 30వ తేదీ అన్ని ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సంబంధిత ప్రాజెక్టుల సీడీపీఓలు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అర్జీలు వచ్చిపడ్డాయి. ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులను రీ నోటిఫికేషన్ కలవరపాటుకు గురిచేస్తోంది.
రాజకీయ ఉపాధే కారణం...
ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులను సంబంధిత శాసనసభ్యుని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో భర్తీచేస్తారు. శాసనసభ్యుడు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్‌డీవో, సీడీపీవో, వైద్యాధికారులు సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల నియామకం మొత్తం శాసనసభ్యునిపైనే ఆధారపడి ఉంటుంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాల సమయంలో శాసనసభ్యుని జోక్యం ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.
ముందుగానే ఒక జాబితాను సిద్ధం చేసుకుని దానికి అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం జరగనున్న అంగన్‌వాడీల ఎంపిక రాజకీయ ఉపాధేనని పలువురు అభ్యర్థులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల వివరాలు, అభ్యర్థుల జాబితాలు సంబంధిత శాసనసభ్యుల వద్దకు చేరాయి. ఈ నేపథ్యంలో రీ నోటిఫికేషన్ ఇప్పించి తమ పార్టీకి చెందిన వారినే నియమించేందుకు ప్రత్యేక జాబితాను రూపొందించే పనిలో అధికార పార్టీ శాసనసభ్యులున్నట్లు సమాచారం.
అంగన్‌వాడీల నియామకాల్లో ‘రాజకీయం’
Published Wed, Jan 29 2014 4:24 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement