రొంపిచర్ల : స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ వైఖరికి నిరసనగా రొంపిచర్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అమ్మా, బాబు అంటూ పని చేయించుకుని ఇప్పుడు తమను విస్మరిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, చెరువు పనుల కేటాయింపుల్లో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఉండటం లేదని, ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన రీతిలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీని వీడాలనే నిర్ణయానికి వస్తున్నారు.
మొదటి అడుగుగా మండలంలోని సంతగుడిపాడు గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు నలబోతు వెంకటరామయ్య ఆధ్వర్యంలో వీరంతా సమావేశమయ్యారు. పార్టీ నేతల వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని, కనీసం సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు.
ఇటీవల మండల మహిళా అధ్యక్షురాలి నియామకాన్ని నర్మగర్భంగా ప్రస్తావిస్తూ అర్హతలేని, భాషా పరిజ్ఞానం లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తున్న తీరును విమర్శించారు. దీంతో పాటు పార్టీకే చెందిన ఎస్సీ కుటుంబాలకు చెందిన 105ఎకరాల్లో చెరువు తవ్వేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామా చేసిన కుటుంబాల్లో మామిళ్ళపల్లి ఆదిబాబు, వాకా రమణారెడ్డి, లగడపాటి ఆంజనేయులు, కల్లూరి ఆంజనేయులు, పాలపర్తి కోటేశ్వరరావు, బండారుపల్లి రామారావు, వర్ల వెంకయ్య తదితరులు ఉన్నారు.
టీడీపీ సభ్యత్వానికి 150 కుటుంబాలు రాజీనామా
Published Thu, Jun 18 2015 1:18 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement