
వ్యాపారులతో ఇబ్బంది లేదని తీర్మానం
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు : పట్టణంలోని పంచాయతీ స్థలంలో ఆక్రమణలకు పాల్పడి వ్యాపారాలు చేసుకుంటున్న వారితో ఎలాంటి ఇబ్బంది లేదని అత్యవసర సమావేశం ద్వారా పంచాయతీ తీర్మానాన్ని ఆమోదించినట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారుల దుకాణాలను ఉన్నఫళంగా తొలగిస్తే జీవనోపాధి కోల్పోతారనే ఉద్దేశంతో సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, వార్డుసభ్యులు కలసి ఈ తీర్మానం చేసినట్టు చెప్పారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల రెవెన్యూ, పంచాయతీరాజ్, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో కొందరు వ్యాపారులకు ఆక్రమణలపై నోటీసులను అందజేసినట్టు తెలిపారు. మూడు వారాల్లో కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వింటామని నోటీసులో పేర్కొన్నట్టు గుర్తుచేశారు. ఈ లోగా రెవెన్యూశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వ్యాపారులకు ఏడో నంబరు నోటీసు అందజేశారన్నారు.
దీంతో సుమారు 300 మంది చిరువ్యాపారులు సర్వం కోల్పోయే అవకాశం ఉందన్నారు. వారి కుటుంబాలు వీధిన పడతాయన్నారు. అధికారులు సైతం చిరువ్యాపారుల జీవనవిధానాన్ని దెబ్బతీసే విధంగా హడావుడి చేయవద్దన్నారు. పంచాయతీ స్థలంలోని ఆక్రమణలు పంచాయతీ ఆధీనంలో ఉన్నందున సర్పంచ్, మెజారిటీ సభ్యులు కలసి ఆక్రమణలతో పంచాయతీకొచ్చినా ఇబ్బంది ఏమీ లేదని తీర్మానం చేసినట్టు తెలిపారు. పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్డుమార్జిన్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపేవరకు ఆక్రమణలను తొలగించవద్దని తీర్మానంలో రాసుకున్నట్టు చెప్పారు.
ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వారికి తనతో పాటు, ఎంపీపీ, సర్పంచ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు అండగా ఉంటారన్నారు. చిరువ్యాపారులు వీధిన పడకుండా ఆదుకుంటామన్నారు. తీర్మానం ప్రతిని వ్యాపారులకు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఉససర్పంచ్ సోమా అరుణ, వార్డు సభ్యులు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పాల్గొన్నారు.