కోదాడటౌన్, న్యూస్‌లైన్: అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే ఏనాటికైనా బండారం బయటపడక తప్పదని రుజువు చేస్తున్నది ఈ ఉదంతం. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై కనీస అర్హతలు, ఉద్యోగ వయసు లేకపోయినా తమ బంధువులను కోదాడ గ్రామపంచాయతీలో ఉద్యోగులుగా నియమించుకున్న వైనంపై హైదరాబాద్‌కు చెందిన సుప్రియా ఫౌండేషన్ లోకాయుక్తలో దాఖలు చేసిన కేసు అక్రమార్కుల నిజరూపాన్ని బయటపెట్టింది. కోదాడ గ్రామ పంచాయతీలో జరిగిన ఈ వ్యవహరంలో పాత్రధారులైన నాటి ఈఓతో పాటు సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసిన డీపీఓ, బదిలీ చేసిన మరో డీపీఓ, డీఎల్‌పీఓలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశా రు. అర్హత లేకపోయిన కోదాడ గ్రామ పంచాయతీ నాటి పాలకవర్గ పెద్దలతో కుమ్మక్కై తొమ్మిది మంది.. ఎన్‌ఎంఆర్‌లుగా నియమితులయ్యారు. ఆ తర్వాత దొడ్డిదారిన సర్వీస్‌లను రెగ్యులరైజ్ చేయించుకున్నారు. దీనిపై లోకాయుక్తలో కేసు నమోదు కావడంతో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించి, జీతం రికవరీ చేయడంతో పాటు అధికారులపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నియమాకం చెల్లదని స్పష్టం చేసిన డీపీఓ
సయ్యద్ గులాం అలీ నియామకంపై ఆరోపణలు రావడంతో 1995లో డీపీఓగా వచ్చిన రామారావు గ్రామ పంచాయతీకి 212 జీఓ వర్తిం చదని, గులాం అలీని ఆ జీఓ ప్రకారం రెగ్యులరైజ్ చేయడం చెల్లదని తిరిగి ఎన్‌ఎంఆర్‌గా కోదాడకు పంపాలని ఉత్తర్వు నంబర్ బీ1/77/98/పీటీఎస్ తేదీ 28-05-95న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గులాం అలీ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో జీఓ నంబర్ 2513/1998 ద్వారా సవాల్ చేశారు. కానీ ట్రిబ్యునల్‌లో అతనికి వ్యతిరేకంగా తీర్పురావడంతో పాటు డీపీఓ చర్యలను సమర్థించింది. దీంతో గులాం అలీ ప్రభుత్వానికి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. తనను తొలగించవద్దని సర్వీసును కొనసాగించాలని కో రడంతో పంచాయతీరాజ్ కమిషనర్ ఎస్.చెల్లప్ప మెమో నం బర్ 17490/ఈ/9/98 తేదీ 29-01-1998న దీనిపై స్టేటస్ కో ఇస్తూ సమగ్ర విచారణ చేసి నివేదికను ఇవ్వాలని ఇక్కడి అధికారులను ఆదేశించారు. దీనిని అడ్డుపెట్టుకొని అప్పటినుంచి గులాంఅలీ ఉద్యోగిగా కొనసాగుతునే ఉన్నాడు.
బట్టబయలు చేసిన విచారణాధికారి
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ అధికారిగా అప్పటి డీఎల్‌పీఓ మోహన్‌గుప్తాను నియమించారు. ఆయన దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఏ1/238/98 తేదీ 16-07-98న డీపీఓకు అందజేశారు. దానిలో ఇతను ఉద్యోగంలో నియమింపబడిన నాటికీ 18 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నాడని, అప్పటికీ ఇంకా టైప్ పరీక్ష కూడా పాస్ కాలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇతను 1988లో ఉద్యోగంలో చేరగా 1994 వరకు ఇంగ్లిష్ లోయర్‌పరీక్ష కూడా పాస్ కాలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఇతని నియామకం చెల్లదని ఆ నివేదికలో పేర్కొన్నారు.
లోకాయుక్తను ఆశ్రయించిన సుప్రియా ఫౌండేషన్
ఈ మొత్తం వ్యవహరంపై హైదరాబాద్‌కు చెందిన సుప్రియా ఫౌండేషన్ నిర్వాహకుడు జి.శ్రీనివాసరావు 2394/2011/బీ1 తేదీ 19-10-2001న లోకాయుక్తలో కేసు వేశాడు. దీనిపై స్పందించిన లోకాయుక్తా పూర్తి వివరాలను తెలపాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రస్తుత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.నాగిరెడ్డి పంచాయతీరాజ్ కమిషనర్‌కు మెమో నంబర్ 12363/ఇ8/ఎ1/2013 తేదీ 4-01-2014న ఉత్తర్వులు జారీ చేశారు. గులాంఅలీ అనే అతను అసలు ప్రభుత్వ ఉద్యోగే కాదని, ఇప్పటివరకు జీతం పేరుతో తీసుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయడంతో పాటు సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసిన అప్పటి అధికారులు డీపీఓ కోటిరెడ్డి, బదిలీ చేసిన మరో డీపీఓ రాజారెడ్డి.. ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న డీఎల్‌పీఓ హెచ్.జనార్దన్‌రెడ్డి, కోదాడ ఈఓ మున్వర్‌పై యాక్ట్ 2/94 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరినట్టు తెలిసింది. ఇదే విధంగా కోదాడ గ్రామపంచాయతీలో అక్రమంగా నియమించబడి సర్వీస్‌ను క్రమబద్ధీకరించుకున్న మరికొంత మందిపై సుప్రియా ఫౌండేషన్ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సర్పంచ్‌ని సైతం ప్రశ్నించండి....
1988లో కోదాడ సర్పంచ్‌గా ఉన్న పి.సత్యబాబును కూడా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తప్పుపట్టారు. అధికారం లేకున్నా నియమాకాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. జీఓనంబర్ 138 పంచాయతీరాజ్ తేదీ 16-03-82 ద్వారా సీనియర్ అసిస్టెంట్‌కన్నా దిగువగా ఉన్న పోస్టు నియామకాన్ని డీపీఓ భర్తీ చేయాలి. సర్పంచ్‌కు అధికారం లేదు. తీర్మానం ద్వారా ఎందుకు చేయాల్సి వచ్చిందో నాటి సర్పంచ్‌ను సమాధానం కోరాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రమ నియామకంపై లోకాయుక్త కన్నెర్ర
Published Mon, Feb 3 2014 4:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement