సౌకర్యాలు మరచి సంబరాలా!? | the royal celebrations are doing with the past government-funded | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు మరచి సంబరాలా!?

Published Wed, Aug 27 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

the royal celebrations are doing with the  past government-funded

 సాక్షి, అనంతపురం :  శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినా అందుకు తగ్గట్టు పెను‘కొండ’లో సౌకర్యాలు లేకపోవడంతో ఉత్సవాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొండపైకి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగా లేదు. ప్రతి ఏటా ఉత్సవాల సమయంలో రోడ్డును అటు.. ఇటు కొద్దిగా చదును చేస్తున్నారే కానీ వాహనాలు, పాదచారులు వెళ్లేందుకు అనుకూలంగా తారు రోడ్డు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు.
 
 2010లో ఉత్సవాలు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ప్రతి ఏటా రాయల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా వచ్చిన గవర్నర్ నరసింహన్ కోటపై గవర్నర్ బంగ్లా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునఃనిర్మిస్తామని హామీ ఇచ్చినా, ఆయన మరణానంతరం దాని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. రాయల చరిత్రకు సంబంధించి మ్యూజియం నిర్మిస్తామన్న అప్పటి మంత్రి శైలజానాథ్ హామీ ఆచరణకు నోచుకోలేదు.
 
 చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని ఆలయాలు, పురాతన కట్టడాల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా విడుదలైన అరకొర నిధుల్లోంచి ఇపుడు రూ.32 లక్షలు ఈ ఉత్సవాలకు కేటాయించినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన టీడీపీ సర్కారు కోట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కోటలో కూలిపోయిన పురాతన కట్టడాలను పునఃనిర్మించడానికి జాతీయ పురావస్తు శాఖ ద్వారా నిధులు కేటాయించినప్పటికీ కేవలం ఒకటి రెండు పనులతో మమ అనిపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ప్రస్తుత ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం గమనార్హం.
 
 కొండపైకి రాళ్లు తేలిన రోడ్డే దిక్కు : పెనుకొండ పట్టణం నుంచి కోట పైకి 8 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది. గతంలో పైకి వాహనాలు వెళ్లడానికి వీలుండేది కాదు. ఈ క్రమంలో తొలి పంచశతాబ్ది ఉత్సవాల సందర్భంగా అప్పటి సీఎం రోశయ్య కొండపైకి రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు రూ.5.50 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ నిధులు కేవలం రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికే సరిపోవడంతో మిగిలిన రోడ్డు నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. ‘కొండ’ంత నిర్లక్ష్యం శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడిన క్రమంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ కొండపైకి వాహనంలో వెళ్లి అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు.
 
 పట్టుజారితే.. గోవిందా.. : రాయల వైభవాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తే సరిపోదని, కోట, రాయల చరిత్ర నిలిచిపోయేలా కోటను అభివృద్ధి చేస్తే చాలని పలువురు కోరుతున్నారు. కోటపైభాగంలోని లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి స్తంభాలు, రాళ్లు పెకిలించేశారు. కోట దిగువ భాగంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. గోరంట్ల వాకిలి నుంచి గగన్‌మహల్‌కు వెళ్లేందుకు రాజగోపురానికి రాజమార్గం ఉంది. ప్రస్తుతం రాజగోపురం మార్గాన్ని ఓ సంస్థ ఆక్రమించేసింది. తమకు పట్టా ఉందని చెబుతూ..ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు చేశారు.
 
 కోట లోపలి భాగంలో విశాలమైన స్థలాలను ఆక్రమించి ఎక్కడికక్కడ కట్టడాలు కట్టేశారు. పాంచ్‌బీబీ దర్గాకు వెళ్లే మార్గంలో ఆంక్షలతో కూడిన ప్రవేశాన్ని కల్పించడంపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కోటలో అక్రమ కట్టడాలతో కోట్లాది రూపాయల స్థలాన్ని ఆక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ప్రభుత్వం అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని తొక్కిపెట్టేశారు. పెనుకొండ కోటలో రాయల చరిత్రను భావితరాలకు అందించాలంటే ఈ సంపదను పూర్తి స్థాయిలో పరిరక్షించడమే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement