ప్రైవేటు కేంద్రాల్లో రైలు టికెట్ల విక్రయం!
జనవరి నుంచి అందుబాటులోకి రైల్వే శాఖ వినూత్న ప్రయోగం
అందిన దరఖాస్తులు 47... వాటిలో ఎంపికైనవి 21
హైదరాబాద్‌లో 5 చోట్ల మాత్రమే ఏర్పాటు
హైదరాబాద్: రైలు టికెట్ కొనాలంటే ఇక రైల్వే స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్‌లలో విక్రయించే టికెట్లనే ఇక ప్రైవేటు కేంద్రాల్లో కూడా పొందొచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ‘యాత్రీ టికెట్ సువిధ కేంద్రాలు (వైటీఎస్‌కే)’ జనవరి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు రైల్వే స్టేషన్‌లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా మాత్రమే సాధారణ రైల్వే టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు ఆన్‌లైన్ ద్వారా ఈ-టికెట్లు విక్రయిస్తున్నాయి. ఇప్పుడు రైల్వే కౌంటర్లలో అమ్మే టికెట్లను ప్రైవేటు సంస్థలు కూడా విక్రయించేలా కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం త్వరలో అమల్లోకి వస్తోంది. ప్రయాణికులు సుల భంగా టికెట్లు పొందాలనే ఉద్దేశంతో రూపకల్పన చేసిన ఈ కొత్త విధానానికి భారీ స్పం దన ఉంటుందని రైల్వే శాఖ భావిం చినా... వాస్తవానికి అది అంత గా విజయవంతమయ్యే సూచనలు కనిపించడం లేదు. వైటీఎస్‌కే ప్రతిపాదనకు ప్రైవేటు సంస్థలు పోటీపడి దరఖాస్తు చేసుకుంటాయనుకున్న రైల్వే శాఖకు షాక్ ఇస్తూ అత్యల్ప సంఖ్యలోనే సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కేవలం 21 సంస్థలకు అనుమతి లభించింది. హైదరాబాద్‌లో ఐదు చోట్ల మాత్రమే ఇవి ఏర్పాటు కానుండటం విశేషం. భవిష్యత్తులో వీటికి స్పందన ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు.
పనితీరు ఇలా...
గత ఐదేళ్లుగా ఈ-టికెటింగ్ అనుభవం ఉన్న సంస్థల నుంచి వైటీఎస్‌కే కోసం రైల్వేశాఖ గత ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించింది. తాను టికెట్లు అమ్మేందుకు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టే కీలక నిర్ణయం అయినందున... ఈ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.ఐదు లక్షలు, అడ్వాన్స్ డిపాజిట్‌గా మరో రూ.5 లక్షలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాలనే నిబంధనలు విధించింది. దీంతో కేవలం 47 దరఖాస్తులు మాత్రమే అందగా.. వాటిని పరిశీలించి 21 సంస్థలను రైల్వేశాఖ ఎంపిక చేసింది. తాను ముందుగా నిబంధనల్లో పేర్కొన్న ఫీజులను చెల్లించాల్సిందిగా ఆయా సంస్థలకు లేఖలు రాసింది. అవి ఆ మొత్తాన్ని చెల్లించగానే టికె ట్లు విక్రయించే కేంద్రాలు ఏర్పాటవుతాయి. కంప్యూటర్ టెర్మినల్స్, టికెట్ ప్రింటర్లు, మోడెమ్స్‌లాంటి వాటిని రైల్వే సమకూర్చనుండగా, ఏజెన్సీలు డేటా కమ్యూనికేషన్ చానల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రయాణికులపై భారం ఇలా...
మనం నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ కొంటే నిర్ధారిత టికెట్ రుసుము మినహా అదనంగా ఎలాంటి చార్జీలు ఉండవు. కానీ అదే టికెట్‌ను వైటీఎస్‌కే కౌంటర్‌లో కొంటే... ఒక్కో స్లీపర్ క్లాస్ టికెట్‌పై రూ.30, ఇతర ఉన్నత శ్రేణి తరగతులకు సంబంధించిన వాటిపై రూ.40 చొప్పున సర్వీస్ చార్జీ పడుతుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలోని ప్రైవేటు ఈ-టికెట్ కౌంటర్లలో ఒక్కో టికెట్ పై రూ.15 నుంచి రూ.20 వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నారు. వెరసి వైటీఎస్‌కే కౌంటర్లు ప్రయాణికులపై భారాన్ని మోపబోతున్నాయి. దీంతో ప్రయాణికుల స్పందన అంతంత మా త్రంగానే ఉంటుందని ఊహించిన సంస్థలు వాటిని పొందేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది.