Rs 10000 Fine On Indian Railways : దేశంలో అత్యధిక మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైళ్లలో ఎదురయ్యే అసౌకర్యాలతో ప్రతిఒక్కరూ ఎప్పుడోసారి ఇబ్బంది పడే ఉంటారు. ఇలా అసౌకర్యానికి గురైన ఓ ప్రయాణికుడు రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి చుక్కలు చూపించాడు.
పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన కుటుంబానికి బెర్త్‌లను సెకెండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేసినందుకు రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని నార్తన్ రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC )ను చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
జిరాక్‌పూర్‌కు చెందిన పునీత్ జైన్ 2018 ఆగస్టులో తనకు, తన కుటుంబానికి వైష్ణో దేవి నుంచి చండీగఢ్‌కి శ్రీ వైష్ణో దేవి-కల్కా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కొక్కరికీ రూ. 2,560 చొప్పున సెకెండ్ ఏసీ టిక్కెట్‌లను కొనుగోలు చేశారు. అయితే అతను తన కుటుంబంతో సహా 2018 అక్టోబర్ 20న కట్రా రైల్వే స్టేషన్‌కు చేరుకోగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి బెర్త్‌లను డౌన్‌గ్రేడ్ చేశారు.
సమస్యను టీటీఈ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. దీంతో వారు థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవలసి వచ్చింది. సెకెండ్ ఏసీ సౌకర్యాలను కోల్పోయిన వారు థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని అసౌకర్యాలతో ఇబ్బందులు పడ్డారు. దీని తర్వాత బాధితుడు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ టిక్కెట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాపసు చేయాలని కోరగా తిరస్కరణ ఎదురైంది. అనంతరం సబ్ డివిజనల్ మేనేజర్‌కు మొత్తం విషయాన్ని ఈమెయిల్‌లో పంపాడు.
జైన్ అవసరమైన సర్టిఫికేట్ అందించలేదని, అది కూడా చాలా కాలం తర్వాత సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చాడని, ఇది ఇప్పుడు పరిష్కరించడానికి వీలుకాదని నార్తన్ రైల్వే సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్ చేతులెత్తేశారు. ఇక ఈ విషయంపై ఐఆర్‌సీటీసీ వాదన ఏమిటంటే తాము కేవలం ఆన్‌లైన్ బుకింగ్ సర్వీస్ మాత్రమే అందిస్తామని, జైన్ కోరిన ఉపశమనాలకు బాధ్యత వహించమని చెబుతోంది.
సేవలో లోపం నార్తన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ అవలంభించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కారణంగా బాధితుడికి ఇబ్బంది కలిగిందని జైన్‌కు అనుకూలంగా కమిషన్ తీర్పునిచ్చింది. రూ. 1,005 లను 2018 అక్టోబర్ 20 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, దీంతో పాటు రూ. 5,000 నష్ట పరిహారం, రూ. 4,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని నార్తన్ రైల్వే, ఐఆర్‌సీటీలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment