చివరి రోజూ అదే కోలాహలం
నెల్లూరు (బాలాజీనగర్): రొట్టెల పండగలో చివరి రోజూ భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. బారాషహీద్‌లో ఈ నెల నాల్గో తేదీ ప్రారంభమైన రొట్టెల పండగ శుక్రవారం ఘనంగా ముగిసింది. భక్తులు దర్గాను దర్శించుకని కోర్కెలు తీర్చుకునేందుకు రొట్టెలు పంచుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు భక్తులు పాల్గొని ఉంటారని అధికారుల అంచనా.
చివరి రోజు కూడా భక్తుల జోరు తగ్గలేదు. దర్గా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, కమిటీ సభ్యులు, పోలీసులు చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఘనంగా తహలీల్ ఫాతెహా
గంధమహోత్సవం చివరి ఘట్టాన్ని తహలీల్ ఫాతెహా అంటారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు దర్గా ముజావర్ రఫీఅహ్మద్, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ హుస్సేనిలు కలిసి దర్గాలోని 12 గుమ్మత్‌లకు గంధలేపనం చేసి ఫాతెహా చదివారు. అనంతరం ముర్షద్‌లు 12 మంది షహీద్‌లకు సలాం పలికారు. దీంతో రొట్టెల పండగ పూర్తయైంది.
అందరికీ కృతజ్ఞతలు
రొట్టెల పండగను ఘనంగా నిర్వహించడంలో అందరి సహకారం మరవలేనిది. ఉత్సవాలను చక్కటి ప్రణాళికతో నిర్వహించడంలో అన్నిశాఖల అధికారులు సహకారం అందించారు. ముఖ్యంగా దర్గా కమిటీ సభ్యులు అహోరాత్రులు కష్టించినందుకు ఫలితం దక్కింది.
- సయ్యద్ ఫయాజుద్దీన్ అహ్మద్,దర్గా కమిటీ చైర్మన్