ఒకటే నినాదం.. సమైక్యవాదం
రాష్ట్ర విభజనకు నిరసనగా ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం 53వ రోజైన శనివారం కూడా జిల్లాలో అదే ఉత్సాహంతో కొనసాగింది. సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలను కొనసాగించారు. ఉయ్యూరులో విద్యుత్ బంద్ పాటించారు.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో ఉద్యమం ఉరకలెత్తుతోంది. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ఎత్తున ప్రదర్శన చేసి, మానవహారం నిర్మించి, సభ నిర్వహించారు. నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలతో పాటు వంటావార్పు, ఆటాపాటా కార్యక్రమాలు జరిపారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉయ్యూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వచ్ఛందంగా విద్యుత్ బంద్ పాటించారు. ఉయ్యూరు, పరిసర గ్రామాల ప్రజలు కరెంటు నిలిపివేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు ఉయ్యూరు సెంటర్‌లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
రవీంద్రభారతి పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ జరిపారు. ప్రధాన సెంటర్‌లో స్వస్తిక్ ఆకారంలో నిలబడి ఆందోళన చేశారు. మిలటరీ యూనిఫాంతో సెంటర్‌లో రోడ్డుపై నిలబడి సెల్యూట్ చేస్తూ జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. తిరువూరు ఎంపీడీవో ఆఫీసు రోడ్డులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. తిరువూరు మండలంలోని రోలుపడి ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులు తిరువూరు-మధిర ఆర్ అండ్ బీ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నూజివీడులోని చిన్న గాంధీబొమ్మ సెంటరు సమీపంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు, పట్టణంలోని సారథి స్కూల్ విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు విన్యాసాలు చేశారు. పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి ఎస్‌వీఎస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రహదారిపై రాస్తారోకో జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెడనలో సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 47వ రోజుకు చేరాయి.
జాతీయజెండాతో ప్రదర్శనలు..
శనివారం నాటి ఆందోళనల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు ప్రధానాకర్షణగా నిలిచాయి. విజయవాడలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 300 మీటర్ల మువ్వెన్నల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. వత్సవాయిలో 200 మీటర్లు, జగ్గయ్యపేటలో 105 మీటర్లు, అవనిగడ్డలో 160 మీటర్ల జాతీయ పతాకాలతో నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముసునూరులోనూ 20 మీటర్ల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలో విద్యార్థి జేఏసీ కన్వీనర్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి, సమైక్యవాదులకు మధ్య టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుడు), మహిళలతో తొక్కుడు బిళ్ల ఆట ఆడించి నిరసన తెలిపారు. కృష్ణలంకలో ప్రైవేటు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సుమారు వెయ్యి మంది ర్యాలీ నిర్వహించారు. నగర పాలకసంస్థ సిబ్బంది కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరేందుకు 13 యూనివర్సిటీల ప్రొఫెసర్లు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు గరీబ్థ్‌ల్రో ఢిల్లీ వెళ్లారు. వారికి పలువురు సమైక్యవాదులు వీడ్కోలు పలికారు.