అధికారుల నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. ఆరుగాలం కష్టం చేసి పండించుకున్న పంటలు రెప్పపాటులో ముంపునకు గురవుతుండడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దిపాటి వర్షం పడినా ప్రధాన డ్రెయిన్‌సైతం పొంగిపొర్లడం, డ్రె యిన్లకు గండ్లు పడటం ఏటా ఓ తంతుగా మారింది. నాలుగేళ్లుగా బాపట్ల డివిజన్‌లోని అన్నదాతలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
బాపట్ల టౌన్: బాపట్ల డివిజన్‌లోని రైతులకు ప్రతి ఏటా ముంపు బెడద తప్పటం లేదు. ఖరీఫ్ సీజన్ పూర్తయిన వెంటనే ఏ ఏ డ్రెయిన్లు అభివృద్ధి చేయాలి. మైనర్, మేజర్ సమస్యలు ఏం ఉన్నాయి. ఏ మేరకు నిధులు అవసరం అవుతాయో అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో పంటలు ముంపు బారినపడుతున్నాయి. రైతులు మా నసికంగా కుంగిపోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు.
పారమట్టి తీస్తే ఒట్టు ...
గత ఏడాది ఖరీఫ్ పంటచేతికొచ్చే తరుణంలో అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు బాపట్ల మండలంలోని జమ్ములపాలెం, జిల్లెళ్లమూడి, కంకటపాలెం సమీ పంలోని పలుప్రాంతాల్లో నల్లమడ డ్రెయిన్‌కు భారీ గండ్లు పడ్డాయి. వరద ఉధ్రుతికి పొలాలు ముంపునకు గురికావడంతోపాటు జిల్లెళ్లమూడి గ్రామం పూర్తిగా మునిగిపోయి గృహాల్లోకి వరద నీరు చేరింది.
ఈస్ట్‌శ్యాంప్ డ్రెయిన్‌కు గండిపడి మూలపాలెం సమీపంలోని పంటపొలాలు మొత్తం పూర్తిగా మునిగిపోయాయి. వెదుళ్లపల్లి డ్రెయిన్‌కు గండ్లుపడటంతోపాటు, కల్వర్టులు సైతం కోతకు గురయ్యాయి.
మరుప్రోలువారిపాలెం డ్రెయిన్ మొత్తం పంటకాలువలా పూడుకుపోయి దర్శనం ఇచ్చింది.
నల్లమడ డ్రెయిన్‌కు గండ్లుపడి సుమారు 15 వేల ఎకరాల మేర పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈస్ట్‌శ్యాంప్ డ్రెయిన్‌కు గండ్లు పడి సుమారు 2,500 ఎకరాలు, వెదుళ్లపల్లి డ్రెయిన్‌కు గండ్లు పడి సుమారు 8 వేల ఎకరాలు, మరుప్రోలువారిపాలెం మైనర్‌కు గండిపడి సుమారు 1500 ఎకరాల మేర పొలాలు ముంపునకు గురయ్యాయి.
ఇంత ఘోరం జరిగినా అధికారులు ఇప్పటివరకు కనీసం స్పందించిన దాఖలాలు లేవు. ఆయా డ్రెయిన్లలో ఒక్కపార మట్టి తీసిన పాపాన పోలేదు.
హామీలు సరే....ఆచరణ ఏదీ..?
వరదల కారణంగా పంటపొలాలు, గృహాలు ముంపునకు గురైనప్పుడు ఆ ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులకు నల్లమడ, ఈస్ట్‌శ్యాంప్ డ్రెయిన్ల ఆధునికీకరణ గత మూడేళ్లగా చేపట్టకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి వచ్చిందని ప్రజలు తమ గోడు విన్నవించుకున్నారు. స్పందించిన డ్రైనేజి శాఖ ఉన్నతాధికారులు, పాలకులు ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి, ఖరీఫ్ పూర్తయిన వెంటనే శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు.
త్వరలో పనులు చేయిస్తాం
బాపట్ల డివిజన్‌లోని డ్రెయిన్లలో పేరుకుపోయిన మట్టి, తూటుకాడలను తొలగించేందుకు ఈ ఏడాది రూ. 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. వాటితో నల్లమడ, ఈస్ట్‌శ్యాంప్, వెదుళ్లపల్లి, మరుప్రోలువారిపాలెం మైనర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన మట్టి, తూటుకాడ తొలగించే పనులు త్వరలో ప్రారంభిస్తాం.
- ఎం. మురళి, డ్రైనేజి డీఈ
గండ్లు పడితే గల్లంతే !
Published Sat, Jul 26 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement