పరీక్షల సీజన్ ఆరంభం
శ్రీకాకుళం న్యూకాలనీ:
పరీక్షల సీజీన్ ఆరంభమైంది. ఇంటర్మీడియెట్ రెండో ఏడాది సైన్స్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు జిల్లాలోని 117 కేంద్రాల్లో జరగనున్న ఈ ప్రాక్టికల్స్‌కు 17,506 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తొలి విడతగా 34 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహణకు బోర్డు సమ్మతించింది. అయితే తొలి విడతగా జరగనున్న పరీక్ష కేంద్రాలన్నీ ప్రైవేటు కళాశాలే కావడం గమనార్హం.
రోజుకు రెండు విడతలగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధగంట వరకు మాత్రమే ఆలస్యంగా హాజరైనవారిని అనుమతిస్తారు. ఒక్కో బ్యాచ్‌లో గరిష్టంగా 20 మంది కనిష్టంగా 10 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా చర్యలు చేపట్టారు. కేంద్రాలపై ప్రత్యేక నిఘా పరీక్షలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు బోర్డుతోపాటు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆర్‌ఐవో పాపారావుతోపాటు డెక్ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాథరావు, హైపవర్ కమిటీ సభ్యులు బి.మల్లేశ్వరరావులు ఇప్పటికే నియామకమయ్యారు. వీరితోపాటు మరోరెండుప్రత్యేకంగా ఫ్లయింగ్ క్వాడ్ బృందాలను, మరోక ప్రత్యేక పరిశీలకుడిని నియమించారు.
‘జంతర్ మంతర్’ అస్త్రాలు సిద్ధం!
ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతోపాటు పాత పద్ధతి (నాన్‌జంబ్లింగ్)లోనే పరీక్షలు జరుగుతుండటంతో జంతర్ మంతర్ అస్త్రాలకు కళాశాలలూ వ్యూహాలు రచించినట్లు వందతులు వస్తున్నాయి. తనిఖీలకు వచ్చే అధికారులతోపాటు డిపార్ట్‌మెంటల్ అధికారులను, ఎగ్జామినర్లను బుట్టలో వేసి, శతశాతం మార్కులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎతుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో గోప్యంగా ఒప్పందాలు జరుగుతున్నట్టు భోగట్టా.