అధికారం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. సీమాంధ్రలో ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తినా విభజన వైపే మొగ్గు చూపుతోంది. అందుకు ప్రతిపక్ష టీడీపీ కూడా వంతపాడుతోంది. ఆ రెండు పార్టీలు ఓట్లు పొందడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాభీష్టానికి అనుగుణంగా సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం నిర్వహిస్తోంది. సంకల్ప బలంతో పోరుబాటలో దూసుకెళుతోంది.
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన పాపంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు పాత్రధారులయ్యారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందని అందుకు కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతంలో పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పటికీ స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా దీక్షలు చేస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాట చెబుతూ తెలుగు ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు లభించడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు వేగంగా పావులు కదుపుతోంది.
యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నియంతృత్వం, టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతోనే ఆంధ్రప్రదేశ్ విభజన దిశగా శరవేగంగా పయనిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామాన్ని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజనకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం నిర్వహిస్తున్నారు. కోట్లాది ప్రజలు ప్రత్యక్ష పోరాటంలో భాగస్వాములైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా వ్యవహరిస్తోంది.
సమైక్య రాష్ట్రంగా ఉంచడమే లక్ష్యంగా....
ఓట్లు-సీట్లు లక్ష్యంగాా రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్, టీడీపీల కుటిల యత్నాలను వైఎస్సార్‌సీపీ ఎండగడుతోంది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోంది. అందులో భాగంగా వేదిక ఏదైనా సరే..ఎంతటి కష్టమైనా..నష్టమైనా సరే..ప్రజాపక్షమే తమ అభిమతమని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ప్రజలపై రుద్దడాన్ని ఆ పార్టీ ప్రతిఘటిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం మరింత ఒత్తిడి కోసం నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకూ ఆమరణదీక్షలు చేపట్టారు. రాయలసీమ, కోస్తాంధ్రలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా మహానేత తనయ, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమైక్యశంఖారావం పేరుతో బస్సు యాత్రను నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించింది. అక్టోబర్ 1నుంచి నవంబర్ 1వతేదీ వరకూ వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
సమైక్య శంఖారావం సభ విజయవంతానికి కసరత్తు..
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా ఈనెల 26న హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో సమక్య శంఖారావం సభ నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శత విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులతో సభ నిర్వహణకు అనుమతి నిచ్చారు. ఈ దశలో సభ విజయవంతానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు విశేషంగా కసరత్తు చేస్తున్నాయి. నియోజకవర్గానికి ఐదువేల మందికి తగ్గకుండా జన సమీకరణకు రూపకల్పన చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక రైలుతో బాటు, ప్రతి నియోజక వర్గం నుంచి పార్టీ శ్రేణులు అద్దె బస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
లక్ష్యం దిశగా.
Published Mon, Oct 21 2013 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement