నారాయణవనం, న్యూస్‌లైన్ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆదివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. వేకువజామున 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యకట్ల, శుద్ధి, గంట తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తి చేశారు. 8.30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్వామికి ఉభయ నాంచారులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కైంకర్యాల అనంతరం ఊంజల్ సేవ చేశారు.
రాత్రి 8 గంటల కు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు, సహాయకులు వీరయ్య, షరాబులు మణి, గోవిందస్వామి పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు స్వామికి ఏకాంత సేవ నిర్వహించారు.
నేడు వెంకన్న రథోత్సవం
పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య తెలిపారు. ఉదయం 7.20 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారికి 40 అడుగుల చెక్క రథాన్ని ముస్తాబు చేశారు. వివిధ రకాల దేవతా ప్రతిమలు, రంగుల వస్త్రాలు, పుష్ప హారాలతో సుందరంగా అలంకరించారు. ఆదివారం ఉదయం ఆలయంలో రథ కలశానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో రూ.500 చెల్లించి దంపతులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
సూర్య, చంద్రులపై వెంకన్న విహారం
Published Mon, May 19 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement