మార్కాపురం, న్యూస్‌లైన్: సక్రమంగా విధులు నిర్వర్తించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ సుందరరావు హెచ్చరించారు. ‘నిధులున్నా... నీరసమే’ అన్న శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురించిన కథనంపై ఆయన స్పందించి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించని ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసి ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గోగులదిన్నె, కె.కొత్తపల్లె, పి.యాచవరం, భూపతిపల్లె గ్రామాల్లో 84 మరుగుదొడ్లు నిర్మించుకున్నా వారికి డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
839 మరుగుదొడ్లు పూర్తి చేయాల్సి ఉండగా 289 మాత్రమే పూర్తి చేశారన్నారు. బొందలపాడు, గజ్జలకొండ, పెద్దనాగులవరం, ఇడుపూరు గ్రామాలకు సంబంధించి 862 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 308మాత్రమే పూర్తి చేసి బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన జయపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. కోలభీమునిపాడు, మాల్యవంతునిపాడు, నికరంపల్లి, వేములకోట గ్రామాలకు సంబంధించి 498 మరుగుదొడ్ల నిర్మాణానికి గానూ 120 మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన టెక్నికల్ అసిస్టెంట్ రహమాన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. చింతగుంట్ల, కొండేపల్లి, నాయుడుపల్లి గ్రామాల్లో 736మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 350 మాత్రమే పూర్తి చేసి 55 మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించని టెక్నికల్ అసిస్టెంట్ సురేష్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బొందలపాడు, జమ్మనపల్లి, తిప్పాయపాలెం గ్రామాల్లో 605 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 144 మాత్రమే పూర్తి చేసి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న బలరాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఓ రమణి, మండల జేఈ శేఖర్‌లు పాల్గొన్నారు.
ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్ల సస్పెన్షన్
Published Tue, Jan 21 2014 6:17 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
Advertisement
Advertisement