ఉపాధ్యాయుడి ఆత్మహత్య
విశాఖపట్నం: ఊహించని రీతిలో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డుకు పక్కన చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొత్తమారిడికోటకు చెందిన కిమిడి చిరంజీవి (30) నందిగాం మండలం కమలాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనులపై విశాఖకు వచ్చాడు. రాత్రి 7.30 గంటల సమయంలో చిరంజీవి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రోడ్డు పక్కన తన బైక్ ఆపి సమీపంలో ఉన్న చెట్ల చాటుకు వె ళ్లాడు. కొద్ది సేపటి తర్వాత అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఎవరో చెట్టుకు వేలాడుతున్నట్టుగా గుర్తించి స్థానికులకు చెప్పాడు. అంతా వెళ్లి చూడగా చిరంజీవి మృతి చెంది చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు.
దీంతో కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాం పరిశీలించారు. మృతుడి సెల్‌ఫోన్‌లో నంబర్ల ఆధారంగా మృతుడి తండ్రి కృష్ణకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం సీఐ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో ఎస్సై సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవి విశాఖకు ఎందుకు వచ్చినట్టు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు అనేది తెలియాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.