అక్రమ కేసును నిరసిస్తూ ధర్నాకు దిగిన ఎమ్మెల్యే
గోపిరెడ్డిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి
పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు
దందాలకు దిగుతూ దౌర్జన్యాలకు పాల్పడడం. అడ్డువచ్చినవారిపై అక్రమ కేసులు పెట్టించడం. ప్రజాధనాన్ని దోచుకు తినడం. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగడం. అధికారులను అడ్డుపెట్టుకుని కుట్ర పన్నడం. ఇలాంటి అరాచకాలన్నీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలకు పరిపాటిగా మారాయి. చివరకు పేద రైతులకు అండగా నిలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు బనాయింపజేయడం వారి అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలిచింది.
- సాక్షి, గుంటూరు
నరసరావుపేట రూరల్ : తనపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమం పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాకు ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 15వ తేదీన నమోదైన కేసు విషయంపై ఎమ్మెల్యేని అరెస్టు చేశారు. అడ్డుకోబోయిన కార్యకర్తలు లాఠీలు ఝుళిపించారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో రోడ్డు నిర్మాణంపై విషయంలో ఎమ్మెల్యేపై తహశీల్దార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై తప్పుడు కేసును కొట్టేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీసీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యేను జీపులో స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్ ఎదుట కార్యకర్తల ఆందోళన..
ఎమ్మెల్యే గోపిరెడ్డిని స్టేషన్‌లో ఉంచి గేట్లు మూసి వేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒకానొక దశలో పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. లోపల ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఆందోళన చెందిన కార్యకర్తలు గేటు తోసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళా కార్యకర్తలను సైతం నె ట్టి వేయడంతో వారు గాయపడ్డారు. ఎమ్మెల్యేను విడుదల చేసే వరకు కదిలేది లేదంటూ గేటు వద్ద బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు విడిచిపెట్టారు. ఆ సమయంలో కార్యకర్తలు ఎమ్మెల్యేను భుజాలపైకి ఎత్తుకుని నినాదాలు చేశారు. అక్కడ నుంచి ఇంటికి ప్రదర్శనగా వెళ్తున్న వారిని పోలీసులు తిరిగి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టకూడదంటూ కార్యకర్తలను చెదరగొట్టారు. నాయకులు జోక్యం చేసుకుని పోలీసులతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే ఇంటి వద్దకు ప్రదర్శన చేరుకోగానే మరోమారు పోలీసులు కార్యకర్తలతో వాగ్వాదానికి దిగి లాఠీచార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను చంపుతారా అంటూ డీఎస్పీ నాగేశ్వరరావును అంబటి గట్టిగా ప్రశ్నించారు. పోలీసుల చర్యతో కార్యకర్తలు తిరగబడ్డారు. నాయకులు సర్దిచెప్పడంతో శాంతించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ప్రజల పక్షాన పోరాడితే అక్రమ కేసులా !
గుంటూరు : ప్రజా సమస్యలపై పోరాడుతున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అక్రమ కేసు బనాయించి సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దుర్భాషలాడారు.
ఇదీ నేపథ్యం...
నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో అనేక ఏళ్ల కిందట నిరుపేద రైతులకు 2.44 ఎకరాల అసైన్డ్ భూమికి సెటిల్‌మెంట్ పట్టాలు ఇచ్చారు. ఈ నిరుపేదలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉంటున్నారనే కక్షతో టీడీపీ ప్రభుత్వం ఆ భూముల మీదుగా ఉపాధి హామీ పథకం కింద సిమెంటు రోడ్డు నిర్మాణానికి గత సోమవారం శ్రీకారం చుట్టింది. దీనిపై ముందుగా నోటీసులు ఇచ్చి భూములు ఉన్న రైతులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. తమకు గతంలోనే పట్టాలు ఇచ్చారని చెబుతున్నా పోలీస్ బందోబస్తు నడుమ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పేద రైతులంతా అదే రోజు తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్కడకు చేరుకుని బాధితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఘటనపై రొంపిచర్ల తహశీల్దారు గత గురువారం నరసరావుపేట రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు.
టెండర్ ఫారాలు లాక్కుంటే కేసులేవీ ?..
నరసరావుపేటలోని ఎన్‌ఎస్‌పీ కార్యాలయం వద్ద ఇటీవల టెండర్లు వేసేందుకు వచ్చిన వారి వద్ద నుంచి దౌర్జన్యంగా ఫారాలు లాక్కుని చించి వేసిన ఘటనపై మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి కుమారుడిపై కేసు నమోదు అయినప్పటికీ ఇంత వరకు అతడిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. అధికాార పార్టీ నేతలు ఏం చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి. ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అక్రమ కేసు బనాయించడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించినా వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, ప్రజాదరణ చూసి ఓర్వలేకే అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్టుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
నరసరావుపేటలో ఉద్రిక్తత
Published Tue, Jan 19 2016 1:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement