రాజకీయాల్లో రాణించాలి
- జ్యూరిచ్‌లో తెలుగువారి సమావేశంలో ప్రవాసాంధ్రులకు చంద్రబాబు పిలుపు
- ముగిసిన దావోస్ పర్యటన
సాక్షి, అమరావతి: ప్రవాసాంధ్రులు స్థానిక రాజకీయాల్లో పాలు పంచుకునే స్థాయికి ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మూడు రోజులపాటు దావోస్ సదస్సులో వివిధ సంస్థలతో సమావేశాల్లో పాల్గొన్న బాబు బృందం శనివారం స్విడ్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంది. జ్యూరిచ్‌లో ఏపీ ఎన్‌ఆర్‌టీ (ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు) ఆధ్వర్యంలో జరిగిన యూరోపియన్ తెలుగు యూనియన్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎక్కడ ఉన్నా రాజకీయ స్పృహ ఉండాలని, ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రవాసాంధ్రులం తా కలసికట్టుగా ఉండాలన్నారు. ఇండియాలో ఏ ముగ్గురు కలిసినా మూడురకాల మనస్తత్వాలతో ఉంటారని, బృంద మనస్తత్వం అలవాటు కావాలన్నారు. భిన్న పార్టీల్లో ఉన్నా అందరినీ ఒకే ప్లాట్‌ఫామ్ మీదికి తీసుకువస్తానన్నారు.
కెనడాలో భారతీయ మూలాలున్న ముగ్గురు మంత్రులుగా ఉన్నారని తెలిపారు. ఏపీ ఎన్‌ఆర్‌టీ కింద అందరూ ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రవాసాంధ్రులు సద్వినియోగం చేసుకోవాల కోరారు. అనంతరం యూరోపియన్ దేశాలకు చెందిన ఏపీ ఎన్‌ఆర్‌టీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. తర్వాత ఢిల్లీ బయలుదేరారు. శనివారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి విజయవాడ రానున్నారు. ఆయన వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణకిశోర్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులున్నారు.