వేడుకలో విషాదం! | The tragedy at the ceremony! | Sakshi
Sakshi News home page

వేడుకలో విషాదం!

Published Mon, Aug 28 2017 5:26 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

వేడుకలో విషాదం! - Sakshi

వేడుకలో విషాదం!

ఈతముక్కల ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల కన్నీరు
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతితో మిన్నంటిన రోదనలు
మృతుల్లో ఇద్దరిది ఒంగోలు, మరో ఇద్దరిది కందులూరు
రిమ్స్‌లో మృతుల బంధువులను పరామర్శించిన ఎంపీ వైవీ


ఒంగోలు క్రైం : కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద ఆదివారం రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురూ ఆయా కుటుంబాలకు ఆధారంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పగవానికి కూడా రాకూడదని మృతుల బంధువులు రోదిస్తున్నారు. ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు, టంగుటూరు మండలం కందులూరుకు చెందిన మరో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో నలుగురూ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన మృతుల్లో ఇద్దరు మేనమామ, మేనల్లుడు కావడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాయ ఛాయలు అలముకున్నాయి. స్వయానా రక్త సంబంధీకులు కావటమే కాకుండా పక్కపక్క నివాస గృహాలు కూడా. భాగ్యనగర్‌ మూడో లైన్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ ఎదురుగా వీరిద్దరి నివాసాలు. సంఘటన స్థలంలోనే మృతి చెందిన మండపల్లి అశోక్‌ (20) ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (పీడీసీసీ)లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుకున్న అశోక్‌  రెండేళ్ల నుంచి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఆ కుటుంబానికి అశోక్‌ ఒకే ఒక మగ సంతానం.

తండ్రి హనుమంతురావు వాటర్‌ ట్యాంక్‌ పక్కన గేదెలు మేపుకుంటూ కుటుంబాన్ని ఎక్కదీశాడు. ఎదిగొచ్చిన బిడ్డ కుటుంబానికి అందివస్తాడనుకుంటే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలితీసుకుందని కన్నీరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఇక దిక్కెవరంటూ బోరుమంటున్నారు. అదే ప్రమాదంలో మృతి చెందిన భాగ్యనగర్‌కే చెందిన బత్తుల పవన్‌ (14)తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తన వరుసకు మేనమామ అశోక్‌ ద్విచక్ర వాహనంపై సహచరుల వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళ్తుంటే సరదాగా తాను వస్తానని వారి వెంట వెళ్లాడు.

పవన్‌ తండ్రి ఒంగోలు రిమ్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఇంట్లో కూడా పవన్‌ ఒక్కడే మగ సంతానం. ఆ కుటుంబం దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది. తీవ్ర  గాయాలపాలై ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కుట్టుబోయిన శివశంకర్‌ పరిస్థితి విషమంగా ఉంది. శివశంకర్‌ వల్లూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లారీ క్లీనర్‌గా పనిచేస్తూ తనకు ఉన్న ముగ్గురు కుమారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ చదివిస్తున్నాడు. శివశంకర్‌ మూడో సంతానం.

వీరిదీ అంతే..
ఇదే ప్రమాదంలో మృతి చెందిన టంగుటూరు మండలం కందులూరుకు చెందిన ఇద్దరి కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ఆ రెండు కుటుంబాల్లోనూ వీరిద్దరే పెద్ద దిక్కు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన అల్లూరు రాంబాబు(35) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఇటీవలే చనిపోయాడు. భార్యతో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. కందులూరుకే చెందిన రెండో మృతుడు బొబ్బల కృష్ణమూర్తి (25) ఇంటికి పెద్ద కుమారుడు. రెండేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కృష్ణమూర్తి ఉద్యోగాల వేటలో నిమగ్నమై ఉన్నాడు. తండ్రి నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. ఇతనికి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు.

మృతుల కుటుంబాలకు ఎంపీ వైవీ పరామర్శ  
రిమ్స్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం రాత్రి పరామర్శించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ.. హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడే న్న భాగ్యనగర్‌ మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. కందులూరు మృతుల కుటుంబ సభ్యులను కూడా రిమ్స్‌లోనే పరామర్శించారు. మృతదేహాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఒంగోలు టూటౌన్‌ సీఐ పి.దేవప్రభాకర్‌తో ప్రమాదం జరిగిన తీరును ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచు గరటయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, చుండూరి రవి ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement