బంగారమ్మపాలెంలో విషాదం
వరహా నదిలో పడి విద్యార్థిని మృతి
మరో బాలికకు తప్పిన ప్రాణాపాయం
ఎస్.రాయవరం: మండలంలోని బంగారమ్మపాలెంలో శుక్రవారం విషాదం నెలకొంది. గ్రామానికి సమీపంలోని వరహా నదిలో పడి ఓ విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యూపీ పాఠశాలలో కారే పావని (13), మైలపల్లి జ్ఞానేశ్వరిలు ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం ముగించుకుని ఇద్దరూ సమీపంలో ఉన్న వరహానది వద్దకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలి జారి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడే పీతలు పట్టుకుంటున్న మత్స్యకారుడు గమనించి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే పావని ప్రాణాలు వదిలింది. కొన ఊపిరితో ఉన్న జ్ఞానేశ్వరిని హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర సేవలు అందించడంతో ఆమె ప్రాణానికి ప్రమాదం తప్పింది. పావని మృతితో ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. స్థానికులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా విద్యార్థినులు కాలిజారి పడిపోలేదని..ఆత్మహత్యకు యత్నించారని స్థానికులు కొందరు అంటున్నారు.
పాఠశాలకు వెళ్లిన ఇద్దరి విద్యార్థినులు అల్లరి చేష్టలు చేస్తుండడంతో వారి తల్లిదండ్రులు వెళ్లి మందలించారని.. దీంతో మనస్థాపం చెందిన బాలికలు నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించారని అంటున్నారు. ఏమైనప్పటికీ చేతికందొచ్చిన కుమార్తె ఆకాల మరణం చెందడంతో పావని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మత్స్యకారులంతా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవారు. అయితే శుక్రవారం అంతా పావని మృతదేహం వద్ద విలపిస్తుండడం గ్రామస్తులను కన్నీరు పెట్టించింది.