తోటివారికి సాయపడితేనే నిజమైన సంతోషం
‘సిటీ ఆఫ్ చారిటీ’ ఇష్టాగోష్ఠిలో సినీ నటి సమంత
సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ ప్రపంచంలో మనిషికి సంతోషం డబ్బువల్లా, పేరువల్లా రాదు. కేవలం తోటివారికి సాయపడడమే నిజమైన సంతోషాన్ని కలిగిస్తుంది’’ అని సినీ నటి సమంత అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన కథనాలు ‘సిటీ ఆఫ్ చారిటీ’ పేరుతో ‘సాక్షి’ సిటీప్లస్‌లో ఇటీవల ప్రచురితం కావడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.
సోమవారం ఇక్కడి ‘సాక్షి’ టవర్స్‌లో జరిగిన ‘సిటీ ఆఫ్ చారిటి’ ఇష్టాగోష్ఠిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాక్షి చేపట్టిన ఈ సేవా ప్రచారానికి ఎల్లప్పుడూ బాసటగా నిలవడానికి తాను సిద్ధమని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. సాక్షి ఛైర్‌పర్సన్ వైఎస్ భారతి మాట్లాడుతూ, సమాజంలో ఏ ఒక్కరు సేవాపథంలో నడిచినా సాక్షి వారి వెన్నంటి ఉంటుందని పునరుద్ఘాటించారు. ‘‘ప్రత్యూష సపోర్ట్ పేరుతో చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమంతను, ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రత్యూష సపోర్ట్ కో ఫౌండర్ డాక్టర్ మంజులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
పదిమందిలో సేవాభావాన్ని పెంపొందించే ‘సిటీ ఆఫ్ చారిటీ’ కథనాలు ఎప్పటికీ కొనసాగుతాయి’’ అని అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ, ‘‘సేవ చేసే గుణమున్న ప్రతి ఒక్కరినీ సాక్షి అభినందిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఇంతమంది సహృదయుల్ని ఒక వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. సాక్షి డెరైక్టర్లు వైఈపీ రెడ్డి, కేఆర్‌పీ రెడ్డి, పీవీకే ప్రసాద్, రాణిరెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.