=జెడ్పీలో లెక్క తేలని నిధులు రూ.75.74 కోట్లు
=పేరుకుపోయిన 2160 ఆడిట్ అభ్యంతరాలు
=నిధుల వినియోగంపై అనుమానాలు
=నిలిపివేయాలని కోరుతూ ట్రెజరీకి లేఖ రాసే యోచన
సాక్షి, విశాఖపట్నం: నిద్రపోతే మేల్కొల్పగలం. నిద్ర పోతున్నట్టు నటిస్తే... ఆ బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడు. జిల్లా పరిషత్ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. జెడ్పీకి విడుదలైన నిధులకు ఆ శాఖ అధికారులు లెక్కలు తేల్చడం లేదు. ఏమయ్యాయో సమాధానం కూడా చెప్పడం లేదు.దీంతో రూ.75.74 కోట్ల వినియోగంపై అనుమానాలు కమ్ముకు న్నాయి. సక్రమంగా ఖర్చు అయ్యాయనుకోవాలో, దుర్వినియోగమయ్యానుకోవాలో నిర్ధా రించుకోలేక ఆడిట్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. నోటీసులు ఇచ్చినా జిల్లా పరిషత్ అధికారులు పట్టించుకోవడం లేదు. పేరుకుపోయిన అభ్యంతరాల్ని పరిష్కరించకపోవడంతో ఇప్పుడు ఏకంగా నిధులు నిలిపివేయాలని కోరుతూ ట్రెజరీకి లేఖ రాసే యోచనలో ఆడిట్ అధికారులు ఉన్నారు.
జిల్లా పరిషత్‌కు వివిధ ఖాతాల కింద ప్రతి ఏడాది కోట్లాది రూపాయల నిధులు విడుదలవుతున్నాయి. ఇవి సక్రమంగా ఖర్చు కావడం లేదు. రికార్డులు పారదర్శకంగా నిర్వహించడం లేదు. దీంతో ఆడిట్‌లో పెద్ద ఎత్తున లోపాలు, సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా పరిషత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఆడిట్‌లో రూ.75 కోట్ల 74 లక్షల 36 వేల 100 మేర నిధులకు నేటికీ లెక్కతేలలేదు. ఏటా అభ్యంతరాలు పెరగడమే తప్ప జెడ్పీ అధికారులు పరిష్కరించుకునే పరిస్థితి కన్పించడం లేదు.
అకౌంట్‌లలో అంకెల తేడా కారణంగా రూ.1.38 కోట్లు, విడుదలైన దాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన రూ.5,44 కోట్లకు, పక్కదారి పట్టించిన రూ.1.01 కోట్లకు, నాన్ కలెక్షన్ డ్యూస్ కింద రూ.4.01 కోట్లకు, పనులు చేయకుండానే అడ్వాన్సుల కింద ఇచ్చేసిన రూ.2.8 కోట్లకు, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు పెట్టిన రూ.29.4 కోట్లకు లెక్కల్లేవు. అలాగే రూ.24.58 కోట్లకు రికార్డులే చూపించలేదు. ఇక దుర్వినియోగమైన రూ.13.37 లక్షలకు, విడుదలైన దానికన్నా ఎక్కువ చెల్లించిన కారణంగా రూ.1.42 కోట్లకు, రూ.1.64కోట్లు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు లేకపోవడం తదితర అభ్యంతరాలు ఉన్నాయి.
ఈ విధంగా 2160 అభ్యంతరాలు పేరుకుపోయి ఉన్నాయి. సాధారణంగా సెక్షన్ 266 యాక్ట్ ప్రకారం ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో 50 శాతం ప్రతి ఏడాది పరిష్కరించుకోవాలి. కానీ జిల్లా పరిషత్ అధికారులు స్పందించడం లేదు. సరికదా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులకు ఆడిట్ చేయించుకునేది లేదంటూ జిల్లా ఆడిట్ అధికారులు రికార్డులు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆడిట్ అధికారులు ఏటా నోటీసులివ్వడం తప్ప స్పందన లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. సంబంధిత ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు.
నిధులు నిలిపేయాలని ట్రెజరీకి లేఖ రాసే యోచన
ఎప్పటికప్పుడు అభ్యంతరాలు పరిష్కరించకపోయినా, రికార్డులు సమర్పించకపోయినా జీవో నెంబర్ 507 ప్రకారం ఆ శాఖకు నిధులు నిలిపి వేయించే అధికారం ఆడిట్ అధికారులకు ఉంది. ఎంత చెప్పినా వినలేదన్న ఉద్దేశంతో జెడ్పీపై ఇప్పుడా సెక్షన్ ప్రయోగించేందుకు ఆడిట్ అధికారులు యోచిస్తున్నారు. విడుదలైన నిధులకు లెక్కలు చూపించడం లేదని, ఆ నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని, ఇంకా నిధులు విడుదల చేస్తే ఇబ్బందులు పెరిగే అవకాశముందని పేర్కొంటూ ట్రెజరీ అధికారులకు లేఖ రాసే ఆలోచన చేస్తున్నారు.
లెక్కల చిక్కులు
Published Tue, Dec 10 2013 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement