చలిపులి వణికిస్తుంటే తల్లిదండ్రుల పొత్తిళ్లలో వెచ్చగా ఆదమరిచి నిద్రపోవాల్సిన చిన్నారులు వారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక తప్పనిసరి పరిస్థితుల్లో కన్నవారికి దూరంగా హాస్టళ్లలో వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. కష్టం వస్తే కన్నవారికి కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో.. తమకు కలిగే ఇబ్బందులపై నోరెత్తి కూడా అడగలేని దుస్థితిలో ఉన్న ఆ చిన్నారులు కనీసం చలిగాలుల నుంచి కూడా రక్షణ లేక హాస్టల్ గదుల్లో వణికిపోతున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలోని హాస్టళ్లలో న్యూస్‌లైన్ విజిట్‌లో విద్యార్థులు ఇబ్బందులు వెలుగుచూశాయి.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు చలితో సహవాసం చేస్తున్నారు. చలిపులి వెన్నులో వణుకు పుట్టిస్తున్నా ఎవరికీ చెప్పుకోలేని దుస్థితిలో చిన్నారులు కొట్టుమిట్టాడుతున్నారు. వసతి గృహంలోని గదులకు ఉన్న కిటికీల రెక్కలు విరిగి వెక్కిరిస్తుంటే అందులోనే ఓ మూలకు చేరి ముడుచుకుని పడుకుంటున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 151 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 84 బాలుర, 67 బాలికల హాస్టళ్లు ఉన్నాయి.
15,100 మంది విద్యార్థులు వీటిలో వసతి పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4,797 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. విద్యార్థులు బాగోగులు చూసేందుకు ఆత్మీయ అధికారులను ఏర్పాటుచేసినా వారెవరూ తమకు కేటాయించిన వసతి గృహాల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల ఇబ్బందుల గురించి పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.
పెడన నియోజకవర్గంలోని రెండు వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కిటికీల తలుపులు లేకపోవటంతో దోమల బెడద అధికంగా ఉంది. దోమతెరలు పాడైపోవటంతో విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కావు.
కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించిన సమయంలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 34 మంది హాజరైనట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నా ఒక్కరు కూడా వసతి గృహంలో లేకపోవటం గమనార్హం.
అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు ఎస్సీ బాలుర వసతి గృహానికి భవనం లేకపోవటంతో పాఠశాలలోని ఓ గదిని కేటాయించారు. ఈ వసతి గృహంలో 62 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే గదిలో సర్దుకోవాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా అధికారులు మాత్రం వారికి సౌకర్యాలతో కూడిన భవనం ఏర్పాటుకు చొరవ చూపటం లేదు. ఈ హాస్టల్‌లో చదువుతున్న బాలికలు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది.
మైలవరం ఎస్సీ బాలికల వసతి గృహంలో తాగునీటి సౌకర్యం లేదు. బోరునీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో బోరు పాడైపోయింది. దీంతో దూరంగా ఉన్న మరో బోరు నుంచి నీటిని విద్యార్థులు తెచ్చుకుంటున్నారు. తుళ్లూరు వసతి గృహంలో మరుగుదొడ్లు లేకపోవటంతో బాలల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
మచిలీపట్నం వలందపాలెంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆరో నంబరు వసతి గృహం, నోబుల్ కాలనీలోని 10వ నంబరు బీసీ వసతి గృహం భవనాల్లో కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. చలిగాలులతో పాటు దోమలు, విజృంభిస్తుండటంతో విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
నందిగామ నియోజకవర్గంలోని పలు హాస్టళ్లలో తాగునీటి సౌకర్యం లేదు. దీంతో బోరు నీటినే తాగాల్సి వస్తోంది. బోరు నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని ఎస్టీ వసతిగృహంలోని కిటికీలు, తలుపులు సరిగా లేకపోవడంతో చలిగాలులకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు పారా మిలటరీ దళాలు ఈ వసతిగృహంలోనే బస చేస్తుండటం గమనార్హం. జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్టీ వసతిగృహం పక్కనే మురుగుకాలువ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దుప్పట్లు అరకొరగా పంపిణీ చేశారు. బాలికల ఇంట్రిగేటెడ్ హాస్టల్ వద్ద తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వత్సవాయి మండలంలోని ఎస్సీ వసతిగృహంలో ఫ్యాన్లు లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో 14 హాస్టళ్లలో 715 మంది విద్యార్థులు అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. హాస్టళ్లన్నింటిలో కిటికీలకు గెడలు లేక, కొన్నింట కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలితో వణుకుతున్నారు.
గాలిలో ‘సంక్షేమ’...చలితో సహవాసం
Published Mon, Dec 9 2013 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement
Advertisement