బెట్టింగ్‌కు బలి
► పత్తికొండలో విషాదం
► క్రికే ట్ బెట్టింగ్‌లో నష్టపోయిన యువకుడు
► అప్పులపాలై ఆత్మహత్య
పత్తికొండ టౌన్: జల్సాలు, జూదం ఓ యువకుడి ప్రాణం తీశాయి. అప్పుల భారంతో పత్తికొండ పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక 2వ వార్డు బండిగేరిలో నివాసం ఉంటున్న హమాలీ వెంకటేశ్వర్లు, పుల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. నాలుగేళ్ల క్రితం వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబపోషణ భారం మధుపై పడింది. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఎదురుగా మెయిన్‌రోడ్‌లో మొబైల్‌షాప్ ప్రారంభించాడు. ఉన్నతంగా ఉన్న స్నేహితులతో సమానంగా ఉండాలని స్థాయికి మించి అప్పులు చేసి ఖర్చు చేశాడు. ఈ క్రమంలోనే అప్పుచేసి రూ. లక్ష విలువైన బైక్ కొన్నాడు.
ఇటీవల ఐసీసీ క్రికెట్ ట్వంటీ ట్వంటీ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి తన మొబైల్ షాష్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు మిత్రులకు గుడ్‌బై అంటూ మెసేజ్ పెట్టాడు. తెల్లారిన తర్వాత మిత్రులకు అనుమానం వచ్చి షాప్ వద్ద చూశారు. షెటర్ తలుపులు తెరిచి చూడగా మధు మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తలారి శ్రీనివాసులు షాప్‌ను పరిశీలించారు. అక్కడే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాలను వెల్లడించలేదు. సీఐ బీవీ విక్రమ సింహా ప్రభుత్వాసుత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి నుంచి వివరాలు తెలుసుకున్నారు.