ఏలూరులో భారీ చోరీ
Published Thu, Oct 17 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : ఇంటిలో కుటుంబ సభ్యులు ఉండగానే దొంగలు లోనికి ప్రవేశించి సుమారు 90 కాసుల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు దోచుకుపోయిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి ఏలూరు శాంతినగర్‌లో జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతినగర్ 4వ రోడ్డులో నివాసం ఉంటున్న వర్ధినీడు నాగేశ్వరి, ప్రభాకర్‌లకు ఇద్దరు సంతానం. ప్రభాకర్ మృతి చెందడంతో నాగేశ్వరి, పిల్లలు ఆమె తల్లిదండ్రులు కలిసి జీవిస్తున్నారు. 20 రోజుల క్రితం నాగేశ్వరి చిన్న కుమార్తె హైదరాబాదులో ప్రసవించడంతో ఆమె అక్కడకు వెళ్లింది. ఇంటి వద్ద ఉన్న ఆమె తల్లిదండ్రులకు తోడుగా కడపలో ఉన్న చెల్లెలు నాగమణి, కొడుకు అనురాగ్, పని మనిషి లక్ష్మి వచ్చారు.
20 రోజులుగా వారంతా అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంటిలో ఉన్న వారంతా 12 గంటల వరకు మాట్లాడుకుని నిద్రపోయారు. కింద బెడ్‌రూమ్‌లో అనురాగ్, లక్ష్మి, వృద్ధురాలు అనసూయ నిద్రపోయారు. వారంతా నిద్రలో ఉన్న సమయంలో దొంగలు పక్కింటిలో నుంచి ప్రహరీ గొడపై ఎక్కి నాగేశ్వరి ఇంటిపైకి వచ్చారు. కుడివైపు ఉన్న ద్వారం వద్దకు చేరుకుని తలుపు పక్కనే ఉన్న కిటికీలో నుంచి డోర్‌ను తీసుకున్న దొంగలు దర్జాగా ఇంటిలోకి ప్రవేశించారు. అనురాగ్, లక్ష్మి, వృద్ధురాలు నిద్రపోతున్న బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా సరుగులో ఉన్న తాళాలను తీసుకుని బీరువాను తెరిచారు.
అందులో ఉన్న సుమారు 90 కాసుల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును దొంగిలించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు నిద్రలేచిన వృద్ధురాలు బీరువా తెరిచి ఉండడాన్ని గమనించి కంగారు పడింది. బీరువాలోని వస్తువులు కనిపించకపోవడంతో ఇంటిలో ఉన్నవారిని నిద్రలేపింది. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఎం.రమేష్, డీఎస్పీ రజని, టౌన్ సీఐ మురళీకృష్ణ, సీసీఎస్ సీఐ సూర్యచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిలో ఉన్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనసూయకు చిన్న శబ్దం వినపడినా ఆమె వెంటనే నిద్రలేచేదని, అయితే దొంగతనం జరిగినా ఆమెకు మెలకువ రావలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. నిద్రపోతున్న వారిపై దొంగలు మత్తుమందు చల్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ సీఐ నరసింహమూర్తి, సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు.
యువకుడి ఆత్మహత్య
వీరవాసరం, న్యూస్‌లైన్ : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన గంటా మణికంఠ(26) సోమవారం రాత్రి ఒంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అతనిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గతంలోనే తల్లి చనిపోవడంతో మణికంఠ పంజావేమవరంలో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. గ్రామంలో గణపతి నవరాత్రులు, శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీల్లో ఉంటూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు.
సైక్లిస్ట్ దాడిలో ఆటోడ్రైవర్‌కు గాయాలు
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : సైక్లిస్ట్ దాడిలో ఆటోడ్రైవర్ గాయపడ్డాడు. స్థానిక ఉండ్రాజవరం రోడ్డులో బుధవారం ఉదయం ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ జాలాది రవికుమార్ ఆటోతో తణుకు నుంచి ఉండ్రాజవరం వైపు వెళ్తున్నాడు. ఉండ్రాజవరం జంక్షన్ దాటిన తర్వాత సైకిల్‌పై అడ్డంగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి రవికుమార్‌తో ఘర్షణకు దిగి ఇనుప రాడ్డుతో చేతిపై గాయపర్చాడు. ఈ ఘటనలో రవికుమార్ చేతి ఎముక విరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి పరారయ్యాడు. ఏఎస్సై బెన్నిరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement