సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు బిగ్ షాట్స్ ఎవరూ దొరక్క ఆ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. సరైన అభ్యర్థిని నిలబెట్టలేకపోతే ఈ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై పడుతుందని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికార పార్టీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఎంపీ టికెటట్‌ను బలంగా డిమాండ్ చేసే నేతలే లేకపోవటంతో మీరు పోటీకి ఆసక్తిగా ఉన్నారా? అంటూ పలువురు బడా పారిశ్రామిక వేత్తలకు ఆఫర్లు ఇస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సమీకరణాలు. బలాబలాలను బేరీజు వేసుకొని గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఎవరూ సాహించని పరిస్థితి కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు పార్లమెంట్ టికెట్ అవకాశం ఇస్తామంటూ పార్టీ ముఖ్యులు వారిని కొత్తగా మభ్య పెడుతున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికి పార్టీలో తగ్గిన ప్రాధాన్యం, గౌరవం లేదని నెల్లూరు రూరల్‌కే పరిమితం అయ్యారు.
మళ్లీ ఎన్నికలు రావడంతో జనవరి నుంచి వేగంగా రాజకీయ సమీకరణాలు మొదలు కావటంతో ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. అయితే తాజాగా టికెట్ల కేటాయింపుల విషయం వచ్చే సరికి నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానానికే ఆయన పరిమితమయ్యారు. పార్టీ టికెట్ ఆశించిన నేతలు అసమ్మతి గళం వినిపించిన క్రమంలో పార్టీ అధినేత నిర్ణయం మేరకు రూరల్ నుంచి పోటీ చేయాల్సి వస్తుందని చెప్పి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో నెల్లూరు పార్లమెంట్‌కు అభ్యర్థి లేకుండా పోయారు.
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీలో కావలి అసెంబ్లీ సీటు ఇస్తే తాను పోటీకి సుముఖంగా ఉన్నానని, మంతనాలు నిర్వహించడానికి వచ్చిన మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాలకు సృష్టం చేశారు. అయితే కావలి సీటును మాజీ ఎమ్మెల్యే బీద మస్తానరావుకు కేటాయించటంతో కావలి సీటు ఆశలు గల్లంతయ్యాయి. జిల్లాకు చెందిన ఒక బడా పారిశ్రామిక వేత్త కుమారుడిని రంగంలోకి దించాలని సీఎం పేషి అధికారులు భావించి ఆ మేరకు వారికి సమాచారం ఇచ్చారు.
సదరు పారిశ్రామికవేత్త సర్వే నిర్వహించుకోని తమకు సీటు, రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించారు. ఎంపీ టికెట్ ఇప్పిస్తామని స్థానిక నేతలు అయితే హామీలు ఇచ్చారు కానీ పార్టీ పెద్దల నుంచి పిలుపు రాకపోవటంతో కాటంరెడ్డి మౌనంగా ఉండిపోయారు. అసలు ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయడానికి సుముఖంగా లేరనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు టికెట్ల ఆశించి భంగపడిన డీసీసీబీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తనకు అవకాశం ఇస్తే పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశానికి ఆహ్వానించి, మళ్లీ తర్వాత కలవమని మెట్టుకూరుకు చెప్పినట్లు సమాచారం.
కోవూరు టికెట్ ఆశించి భంగపడిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిలో నియమించారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం అని ప్రకటించుకుని తన అభ్యర్థిత్వం పరిశీలించాల్సిదిగా జిల్లా ముఖ్యుల ద్వారా లాబీయింగ్ నడుపుతున్నారు. ఈ క్రమంలో 9న వచ్చి కలవాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీలో జెడ్పీ చైర్మన్‌గా గెలుపొంది ఇటీవలే పార్టీ నుంచి జంప్ అయిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా తనకు పార్లమెంట్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అందరూ పార్లమెంట్ టికెట్ అడుగుతుండటంతో ఏమీ తేల్చుకోలేని స్థితిలో పార్టీ నేతలు పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment