సాక్షి, కర్నూలు : వర్షాకాలం వచ్చింది..దాని వెంటే మొక్కజొన్న పొత్తులు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడివేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకు లభించే మొక్క జొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా కర్ణాటక పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. అక్కడ వుండే నేలస్వభావంతో వాటికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
సీజన్ ఉపాధి..
మొక్కజొన్న పొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. ఇతర ప్రాంతాల నుంచి సైతం దిగుమతి చేసుకోవడంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్‌లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకొని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో దుకాణం, తోపుడు బండిపై వెయ్యి పొత్తుల వరకు కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు.
స్థానిక మార్కెట్‌యార్డుకు దిగుమతి అయిన మొక్కజొన్నపొత్తులను హోల్‌సేల్‌గా ఒక్కటి రూ.7 నుంచి రూ.8వరకు కొని రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 వరకు సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండటంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఎకరం మొక్కజొన్న పంట రూ.50వేలు
మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో ఇక్కడి వ్యాపారులు రాయచూర్, నారాయణపేట పలు ప్రాంతాలకు వెళ్లి మొక్కజొన్న పంటను కొంటారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట ఎకరా కాపు రూ.50వేల వరకు వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి ధరని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు శివారు ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment